వెలుగు చూపించేవాడు సదాశివుడే
క్షీరసాగరమథన సమయంలో కాలకూట విషం పుడుతుంది. లోకాలాను కాపాడటం కోసం ఆ హాలాహలాన్ని శివుడు త్రాగి దానిని కంఠంలో దాచాడు. ఆ విష ప్రభావం వలన ఆయన కంఠం నీలం వర్ణంలోకి మారిపోయింది. ఈ కారణంగానే భక్తజనకోటి ఆయనని 'నీలకంఠుడు' అని పిలుచుకుంటూ వుంటారు.
ఈ విషప్రభావం వలన కలిగే తాపం నుంచి స్వామికి ఉపశమనం కలిగించడం కోసమే ఆయనకి భక్తులు అభిషేకాలు జరుపుతుంటారు. తనకి హాయిని ఇస్తుంది కనుకనే ఆయన అభిషేకాన్ని ఎంతగానో ఇష్టపడుతూ వుంటాడు. అలా అభిషేకంతో ఆనందాన్నిపొందే ఆదిదేవుడు, తన సన్నిధిలో దీపం వెలిగించడం వలన మరింత సంతోషాన్ని పొందుతాడని చెప్పబడుతోంది.
అందువల్లే విశేషమైనటువంటి రోజుల్లో శివాలయాల్లో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక అనునిత్యం పూజా మందిరంలో శివయ్యను స్మరిస్తూ దీపం వెలిగించడం వలన కూడా అదే విధమైన ఫలితం కలుగుతుంది. సాధారణంగా దీపం వెలిగించడం వలన చీకటి తొలగిపోతుంది. ఇక శివయ్య సన్నిధిలో దీపం వెలిగించడం వలన జీవితాన్ని ఆవరించిన చీకట్లు తొలగిపోతాయని చెప్పబడుతోంది.
ఇలా దీపం వెలిగించడం వలన అనేక జన్మల పాపాలు ... దోషాలు నశిస్తాయి. అంతేకాకుండా ఎవరైతే శివుడి సన్నిధిలో దీపాన్ని వెలిగిస్తారో, వాళ్లకి అంధత్వమనేది రాదని చెప్పబడుతోంది. జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మంచిమార్గంలో ప్రయాణిస్తుంది. శుభాలను అందించడమే కాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను సాధించి పెడుతుంది. అందుకే శివయ్య సన్నిధిలో దీపాన్ని వెలిగిస్తూ వుండాలి. అనునిత్యం ఆయనని పూజిస్తూ పునీతులు కావాలి.