మనసు దోచుకునే మహిమాన్విత క్షేత్రం
ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు ఆ ప్రదేశంలో అడుగుపెడుతూ ఉండగానే అది మహిమాన్వితమైన క్షేత్రమనే విషయం తెలిసిపోతూ వుంటుంది. దర్శనమాత్రం చేతనే అలాంటి ఆలోచనను ... అనుభూతిని అందించే క్షేత్రంగా 'అయినవిల్లి' కనిపిస్తూ వుంటుంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. వినాయకుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ఈ క్షేత్రం, ఆధ్యాత్మిక పరమైన ... చారిత్రక పరమైన నేపథ్యాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.
అలాంటి ఈ క్షేత్రంలో ఒక వైపున అన్నపూర్ణాదేవితో విశ్వేశ్వరుడు, మరోవైపున 'శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి' దర్శనమిస్తూ వుంటారు. స్వయంభువు వినాయకుడి ఆశీస్సులు అందుకున్న భక్తులు శివ కేశవుల ఆలయాలను దర్శించుకుంటూ వుంటారు. విశేషమైన పుణ్యతిథుల్లో ఇక్కడ వినాయకుడితో పాటు శివకేశవులకి ప్రత్యేక పూజలు ... సేవలు జరుపుతుంటారు. ఈ సందర్భంగా నిర్వహించే గ్రామోత్సవాల్లో, వినాయకుడు .. శివకేశవుల మూర్తులు కూడా దర్శనమిస్తుంటాయి.
ఈ ఉత్సవంలో పాలుపంచుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు ఆసక్తిని చూపుతుంటారు. గణపతి స్వయంభువుగా ఆవిర్భవించడం ... శివకేశవులు కొలువుదీరడం ... ఈ దేవతా మూర్తులన్నింటితో గ్రామోత్సవాన్ని నిర్వహిస్తూ వుండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు ... దోషాలు నశించి, సకల శుభాలు చేకూరతాయని చెబుతుంటారు. గణపతితో పాటు శివకేశవుల అనుగ్రహం లభిస్తోన్న కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రమని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.