దత్తాత్రేయుడి అనుగ్రహముంటే చాలు

ఒకరి జీవితం ఒకరికి హాయిగా ... ఆనందంగా అనిపిస్తూ వుంటుంది. కానీ ఎవరికి ఉండవలసిన బాధలు వాళ్లకి వుంటాయి. ఎవరి సమస్యలతో వాళ్లు సతమతమైపోతూనే వుంటారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. కుటుంబ సభ్యులందరికీ మనశ్శాంతి లేకుండా చేసే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు.

ఇక మరికొంత మంది ఆర్ధికపరమైన ఇబ్బందులను ఎదుర్కుంటూ వుంటారు. అవసరాలుతీరే మార్గం కనిపించక ... ఆత్మాభిమానం ఎలా కాపాడుకోవాలో తెలియక నానాఅవస్థలు పడుతుంటారు. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో తెలియని అయోమయానికి లోనవుతుంటారు. ఇక విద్య .. ఉద్యోగం .. సంతానం .. సౌభాగ్యం .. ఇలా అనేక విషయాల్లో ఎవరి అసంతృప్తి వారిని వెంటాడుతూనే వుంటుంది.

ఆవేదనకి గురిచేసే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి దత్తాత్రేయస్వామి ఆరాధనకి మించినది లేదని చెప్పబడుతోంది. అనునిత్యం దత్తాత్రేయస్వామివారిని పూజిస్తూ .. ఆయన స్తోత్రాలను పఠిస్తూ .. పారాయణచేస్తూ ... ఆయనకి ప్రీతికరమైన అరటిపండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ వుండాలి. దత్తాజయంతి రోజున ఆ స్వామి వ్రతాన్ని నియమనిష్ఠలతో జరుపుకోవాలి.

అందుకు అవకాశం లేకపోతే గురువారాల్లో గానీ ... పౌర్ణమి రోజుల్లో గాని ఈ వ్రతాన్ని ఆచరించాలి. దత్తాత్రేయుడు కొలువైన ఆలయాలను ... క్షేత్రాలను దర్శిస్తూ వుండాలి. ఇలా అత్యంత భక్తి శ్రద్ధలతో దత్తాత్రేయస్వామిని పూజిస్తూ వుండటం వలన ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెప్పబడుతోంది. ఫలితంగా ఎలాంటి కష్టాలైనా ... బాధలైనా దూదిపింజల్లా కొట్టుకుపోతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News