దైవానుగ్రహానికి మించిన సంపదలేదు
మహాభక్తుల జీవితాలను పరిశీలిస్తే వాళ్లు సంపదకు .. వైభవానికి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వలేదనే విషయం అర్థమైపోతుంది. సంపదల వలన కలిగే సుఖం తాత్కాలికమైనది ... భగవంతుడి నామస్మరణ వలన కలిగే ఆనందమే శాశ్వతమైనదనే వాళ్ల ఉద్దేశం స్పష్టమవుతుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా మనకి పోతన కనిపిస్తూ వుంటాడు.
పోతన ... శ్రీనాథుడు బావామరుదులు. శ్రీనాథుడు మహాపండితుడు ... ఆ పాండిత్య విశేషం చేత రాజాశ్రయాన్ని పొందినవాడు. శ్రీనాథుడి కవితా ప్రవాహానికి తిరుగులేదు .. ఆయన వైభవానికి తక్కువలేదు. సంపదలతో ... సత్కారాలతో ఆయన జీవితం కొనసాగుతూ వుండేది. పోతన పేదరికంతో ఇబ్బందులు పడుతుండటం చూడలేక, ఆయనకి కూడా రాజాదరణ లభించేలా చేయాలని శ్రీనాథుడు అనుకుంటాడు.
అందుకు పోతన ఎంతమాత్రం అంగీకరించడు. తాను శ్రీరాముడి పాదపద్మాలను తప్పించి మరెవరినీ ఆశ్రయించనని చెబుతాడు. రాజు మెచ్చినదానికంటే రాముడు మెచ్చినదానికే తన దృష్టిలో విలువ ఎక్కువని అంటాడు. రాముడు ఇవ్వలేనిది మరెవరూ ఇవ్వలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఒకవేళ ఆ రామచంద్రుడే తనని కావాలని కష్టపెడుతూ వుంటే, ఆ కష్టాలను ఆయన సన్నిధిలో ఆనందంగా అనుభవిస్తానని చెబుతాడు.
ఇలా పోతన మనసు మార్చడానికి శ్రీనాథుడు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక రాజులను ఆశ్రయించిన శ్రీనాథుడు తన చివరిదశలో అనేక కష్టాలను అనుభవించవలసి వస్తుంది. రాముడిని విశ్వసించిన పోతన మాత్రం ఆ స్వామి అనుగ్రహాన్ని సాధించి సంతోషంగా ఆయనలో ఐక్యమైపోతాడు. భోగాలపట్ల వ్యామోహాన్ని పెంచుకోకుండా ఎవరైతే భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తారో, వారికి ఆయన హృదయంలో స్థానం లభిస్తుందనడానికి పోతన జీవితం అద్దంపడుతూ వుంటుంది.