ఆడపిల్లపై వుండే ప్రేమానురాగాలు అలాంటివి

మాలినీ నదీతీరంలో కణ్వమహర్షి ఆశ్రమం వుండేది. ప్రకృతిమాత అక్కడే కొలువై వుందేమోననేంత అందంగా ఆ ఆశ్రమం కనిపిస్తూ వుండేది. అందువలన మహారాజులు ఆయన ఆశ్రమాన్ని దర్శించడానికి ఆసక్తిని కనబరుస్తూ వుండేవాళ్లు. ఆ అడవిలో తనకి లభించిన ఆడశిశువుకి ఆయన 'శకుంతల'అనే నాకరణచేసి, ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటూ వుంటాడు.

ఆ ఆశ్రమమే ప్రపంచంగా ... అక్కడి పశుపక్షులే నేస్తాలుగా శకుంతల పెరుగుతుంది. ఒకసారి కణ్వమహర్షి ఆశ్రమంలో లేని సమయంలో అటుగా వచ్చిన దుష్యంత మహారాజు, శకుంతల సౌందర్యాన్ని చూసి ముగ్ధుడవుతాడు. ఆమెని ఒప్పించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఫలితంగా శకుంతల గర్భాన్ని ధరిస్తుంది. ఆశ్రమానికి తిరిగి వచ్చిన కణ్వమహర్షి ... దైవ సంకల్పానికి మించినది లేదని అంటాడు.

శకుంతల కోరిక మేరకు ఆమెని దుష్యంతుడి దగ్గరికి పంపించివేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ మరుక్షణమే ఆయనకి ఆ ఆశ్రమం కళావిహీనమైపోయినట్టుగా కనిపిస్తుంది. శకుంతల ఆటపాటలకు మురిసిపోయిన పశువులు .. పక్షులు .. వృక్షాలు ... లతలు అన్నీకూడా నిర్జీవమైపోయినట్టుగా అనిపిస్తుంది. ఆమె తనచుట్టూ తిరుగుతూ అల్లరిచేస్తూ ... సేవలు చేసిన దృశ్యాలు ఆయన మనసుని మరింతగా పిండేస్తాయి. శకుంతల లేని ఆశ్రమంలో తాను ఎలా ఉండగలననే బాధతో ఆయన కుప్పకూలిపోతాడు.

ఎన్నడూ లేనిది కణ్వమహర్షి కన్నీళ్లు పెట్టుకోవడం ఆయన పరివారానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన మనసుకి స్థిమితం చేకూర్చడానికి వాళ్లంతా ప్రయత్నిస్తారు. ఆడపిల్లను పెంచిన తనకే ఆమెని అత్తవారింటికి పంపడానికి ఇంత బాధగా వుంటే, ఇక కన్నతల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో కదా అని ఆయన తల్లడిల్లిపోతాడు. ఆడపిల్ల దూరమైపోయేటప్పుడు కలిగే బాధను తట్టుకోవాడానికి ఎంతటి తపోశక్తి అయినా చాలదని అంటాడు. అతికష్టం మీద ఆయన మనసును నిగ్రహించుకుని శకుంతలను అత్తవారింటికి సాగనంపుతాడు.


More Bhakti News