సిరిసంపదలను అనుగ్రహించే వేంకటేశ్వరుడు
వేంకటేశ్వరుడు ఎక్కడ వుంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై వుంటుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే వుంటుందో అక్కడ సిరిసంపదలు కురుస్తాయి. లక్ష్మీదేవిని విడిచి వేంకటేశ్వరుడుకానీ, శ్రీవారిని విడిచి లక్ష్మీదేవికాని క్షణకాలమైనా ఉండలేరు. వేంకటేశ్వరుడి ఆలయానికి వెళితే ముందుగా స్వామివారినీ ... ఆ తరువాత అమ్మవారిని తప్పక దర్శించుకోవాలని చెబుతుంటారు. స్వామివారి స్తోత్రపఠనం తరువాత అమ్మవారి స్తోత్రపఠనం తప్పక చేయాలని అంటారు. అప్పుడే పరిపూర్ణ ఫలితం లభిస్తుందని చెబుతుంటారు.
వేంకటేశ్వరుడు అంటేనే కష్టాలను తీర్చి సుఖశాంతులను ప్రసాదించేవాడని భక్తులు విశ్వసిస్తుంటారు. సిరిసంపదలు ఆ స్వామి అనుగ్రహంతో లభించేవేనని నమ్ముతుంటారు. ఆయన లీలావిశేషాలను అనుభవంలోకి తెచ్చుకుని ఆనందిస్తుంటారు. అలాంటి లీలావిశేషాలతో భక్తుల హృదయాలను చూరగొన్న వేంకటేశ్వరుడు 'మునకోళ్ల'లో దర్శనమిస్తూ వుంటాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది.
లక్ష్మీ పద్మావతీదేవి సమేతంగా ఇక్కడి వేంకటేశ్వరుడు వెలుగొందుతున్నాడు. చాలాకాలంగా ఇక్కడి స్వామివారు భక్తులపాలిట కొంగుబంగారమై విలసిల్లుతున్నాడు. ప్రతి శుక్ర .. శనివారాల్లో ఆలయాన్ని దర్శించే భక్తులసంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడి స్వామివారిని పూజించడం వలన దారిద్ర్యం ... దానివలన కలిగే దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతుంటారు. స్వామివారి పాదాలను అంకితభావంతో ఆశ్రయిస్తే, సిరిసంపదలు చేకూరతాయని అంటారు.
స్వామివారిని నమ్ముకున్నవారికి ఆకలిబాధ ... ఆపద బాధ గురించి తెలియదని అంటూ వుంటారు. మారుమూల గ్రామంలోగల ఈ ఆలయానికి స్వామివారి మహిమల కారణంగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. స్వామివారి చూపులతో పవిత్రమైన ఈ ప్రదేశంలో అడుగుపెట్టడమే ఆలస్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధర్మబద్ధమైన ఏ కోరికను ఆ స్వామి పాదాలముందుంచినా ఆయన కరుణతో అది తప్పక ఫలిస్తుంది.