అందరినీ నడిపించేవాడు ఆ భగవంతుడే
ఎవరైనా ఏదైనా విజయాన్ని సాధించినట్టయితే, ఆ భగవంతుడి దయవలన అది సాధ్యమైందని చెబుతుంటారు. వెళ్లిన పని పూర్తిచేసుకుని వచ్చినప్పుడు, ఆ భగవంతుడి దయవలన అది పూర్తయిందని అంటూవుంటారు. ఇక తాము ఆశించిన విధంగా ఏది జరిగినా, ముందుగా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వుంటారు. అంటే భగవంతుడి అనుగ్రహంతోనే ఏదైనా సాధించగలమనే భావన అందరిలోనూ కనిపిస్తూ వుంటుంది.
అందుకు కారణం భగవంతుడిపైగల బలమైన విశ్వాసమే. ఆయనే వెన్నంటివుంటూ నడిపిస్తూ ఉంటాడనే నమ్మకమే. తనపట్ల భక్తులు కలిగివుండే అంకితభావాన్ని బట్టే భగవంతుడు అనుగ్రహిస్తూ వుంటాడు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో వున్నది స్వామికి తెలుసు కనుక, అందుకు తగిన విధంగానే వారికి కావలసినవి ప్రసాదిస్తూ వుంటాడు. తన సహాయా
న్ని అర్ధించినవారి వెన్నంటేవుంటూ ముందుకు నడిపిస్తుంటాడు.
ఇక స్వామివారిపట్ల అసమానమైన భక్తివిశ్వాసాలను కలిగిన భక్తులకు ఆయన ప్రత్యక్షంగా వెన్నంటివున్న సందర్భాలు లేకపోలేదు. అందుకు నిదర్శనంగా అనేక సంఘటనలు కనిపిస్తూ వుంటాయి. సూరదాస్ ... శ్రీకృష్ణుడికి పరమభక్తుడు. అంధుడైన ఆయన అనుక్షణం స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అలాంటి సూరదాస్ ని పరమాత్ముడైన శ్రీకృష్ణుడు చేయిపట్టుకుని నడిపించాడు.
సూరదాస్ తోనే ఉంటూ కృష్ణుడు ఎన్నోసేవలు చేశాడు. భక్తులు తనకి నైవేద్యంగా సమర్పించిన పదార్థాలను ప్రేమతో తీసుకువచ్చి సూరదాస్ చే తినిపించాడు. తనని విశ్వసించిన భక్తులకు స్వామి ఎంతగా చేరువవుతాడనేది .. వాళ్ల కోసం ఆయన ఎంతగా ఆరాటపడతాడనేది ఈ సంఘటన స్పష్టం చేస్తూ వుంటుంది.