పంచముఖ హనుమను ఆరాధిస్తే చాలు
పరమశివుడికి మహాభక్తుడు ... శౌర్యపరాక్రమాలతో పాటు అనేక వరాలనే రక్షణగా కలిగినవాడు రావణుడు. అలాంటి రావణుడు .. సీతమ్మను అపహరించగా, అనితర సాధ్యమైన రీతిలో ఆ జాడను తెలుసుకుని రావణుడి మరణానికి కారకుడైనవాడు హనుమంతుడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి ఆలింగనాన్ని అందుకున్న అదృష్టవంతుడు హనుమంతుడు.
అందుకే కార్యసిద్ధి కలగాలని కోరుకునేవాళ్లు ఎవరైనా, ముందుగా హనుమంతుడి పాదాలనే ఆశ్రయిస్తూ వుంటారు. హనుమంతుడిని ప్రార్ధించి ఆయన ఆశీస్సులు అందుకుని ఆరంభించిన ఏ పని అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుందని విశ్వసిస్తుంటారు. ఇక ప్రత్యేకించి కొంతమంది 'పంచముఖ హనుమ' ను పూజిస్తుంటారు. ఈ రూపంలో నృసింహస్వామి .. హయగ్రీవస్వామి .. గరుత్మంతుడు .. వరాహస్వామితో కలిసి హనుమంతుడు కనిపిస్తుంటాడు.
ఇలా పంచముఖాలతో అనేక ఆయుధాలను ధరించి మహాశక్తి స్వరూపంగా హనుమంతుడు దర్శనమిస్తుంటాడు. అలాంటి పంచముఖ హనుమంతుడిని పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది. ఎంతోమంది మహర్షులు ... మహాభక్తులు పంచముఖ హనుమను ప్రార్ధించి ఆయన సాక్షాత్కారాన్ని పొందినట్టుగా, కావలసిన వరాలను అందుకున్నట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ కారణంగానే పంచముఖ హనుమ క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా ... మహా శక్తిమంతమైనవిగా విలసిల్లుతున్నాయి. నియమనిష్ఠలను ఆచరిస్తూ అపారమైన విశ్వాసంతో పంచముఖ హనుమంతుడిని అనునిత్యం ఆరాధిస్తూ వుండటం వలన, ధర్మబద్ధమైన కోరిక ఏదైనాసరే తప్పక నెరవేరుతుందని స్పష్టం చేయబడుతోంది.