లక్ష్మీనారాయణుడి ప్రత్యేకత అదే !

శ్రీమన్నారాయణుడు ... లోక కల్యాణ కారకుడు. దుష్టశిక్షణ ... శిష్టరక్షణ కోసం అనేక అవతారాలను ధరించిన స్వామి, అర్చామూర్తిగా అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. నారాయణ అంటూ స్వామివారిని ఒక్కసారి తలచుకున్నంత మాత్రాన్నే సమస్తపాపాలు పటాపంచలైపోతాయి. ఇక లక్ష్మీదేవిని స్మరించుకోవడం వలన సకలసంపదలు చేకూరతాయి.

అలాంటి లక్ష్మీనారాయణులు స్వయంభువు మూర్తులుగా ఆవిర్భవించి, భక్తులకు నయనానందాన్ని కలిగిస్తోన్న క్షేత్రాలు, కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కనిపిస్తూ వుంటాయి. మహిమాన్వితమైన ఆ క్షేత్రాల్లో ఒకటిగా 'పెద ముక్తేవి' కనిపిస్తుంది. కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిధిలోగల ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఎడమతొడపై లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకుని దర్శనమిచ్చే నారాయణుడి స్వయంభువుమూర్తి మనసుని మంత్రించి వేస్తుంది.

సాధారణంగా స్వామివారికి కుడిచేతిలో చక్రం ... ఎడమ వైపున శంఖం వుంటాయి. కానీ ఈ క్షేత్రంలో కుడివైపున శంఖం ... ఎడమవైపున చక్రం కనిపిస్తూ వుంటాయి. ఇలా స్వామివారు ఆవిర్భవించిన అరుదైన క్షేత్రాల జాబితాలో పెదముక్తేవితో పాటు, శ్రీరంగం .. ర్యాలి .. శ్రీకాకుళం .. భద్రాచలం కనిపిస్తుంటాయి. ఇలా స్వయంభువుగా ఆవిర్భవించిన స్వామి శాంతికి ప్రతీకగా చెప్పబడుతున్నాడు.

పెదముక్తేవిలో స్వామివారి ఎడమతొడపై కొలువైన అమ్మవారు 'రాజ్యలక్ష్మీదేవి' గా పూజలు అందుకుంటోంది. ఒకచేతిలో పద్మం ... మరోచేతిలో కుంకుమ భరిణ కలిగి అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. అమ్మవారిని స్వామివారు అక్కున చేర్చుకుని దర్శనమిస్తూ వుండటం వలన, ఈ క్షేత్రాన్ని దర్శించిన భార్యాభర్తల వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతుందని విశ్వసిస్తూ వుంటారు. అమ్మవారి అనుగ్రహం కారణంగా సంపదలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతుంటారు.

సాక్షాత్తు వ్యాస మహర్షిచే పూజలందుకున్న స్వామివారు 'లక్ష్మీపతి' గా భక్తులచే ప్రేమగా పిలిపించుకుంటూ వుంటాడు. అడిగిన వరాలను ఆనందంగా అనుగ్రహిస్తూ వుంటాడు. అరుదైన ముద్రలో స్వామివారు ఇక్కడ ఆవిర్భవించడం ... పురాణపరమైన అనేక విశేషాలకు ఈ క్షేత్రం నిలయం కావడం ... భక్తుల అనుభవాలుగా స్వామి మహిమలు వెలుగుచూస్తూ వుండటం వలన ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా విలసిల్లుతోంది.


More Bhakti News