అహంభావాన్ని తొలగించే భగవంతుడు

పురాణాలు ... ఇతిహాసాలను పరిశీలించినట్టయితే అహంభావాన్ని భగవంతుడు ఎప్పుడూ అంగీకరించలేదనే విషయం అర్థమవుతుంది. తనపట్ల అసమానమైన భక్తిశ్రద్ధలు కలిగిన భక్తులలో ఏమూలన కాస్త అహంభావం వున్నా, అది అజ్ఞానాంధకారంగా భావించిన భగవంతుడు వెంటనే దానిని తొలగించిన సందర్భాలు ఎన్నో కనిపిస్తుంటాయి.

నామదేవుడు ... పాండురంగడి భక్తుడు. తనకంటే ఎక్కువగా స్వామిని ఆరాధించేవారుగానీ, స్వామి మనసును దోచుకున్నవారుగాని లేరనే అహంభావం ఆయనలో తలెత్తుతుంది. అలాంటి నామదేవుడి అజ్ఞానాంధకారాన్ని తొలగించాలని పాండురంగడు అనుకుంటాడు. గోరాకుంభార్ అనే భక్తుడికి సేవచేయడానికిగాను ఆయన ఇంట్లో పనివాడిగా కుదురుతాడు. తనకంటే స్వామివారికి ప్రీతికరమైన భక్తులు ... తనకంటే ఎక్కువగా స్వామివారిని సేవించే భక్తులు ఎంతోమంది వున్నారనే విషయం ఈ సంఘటనతో నామదేవుడికి తెలుస్తుంది. దాంతో ఆయనలోని అహంభావం మంచులా తొలగిపోతుంది.

ఇక 'తొండమాన్ చక్రవర్తి' తిరుమల శ్రీనివాసుడిని బంగారుపూలతో పూజిస్తూ ఉండేవాడు. తనకంటే గొప్ప భక్తుడు లేడనే ఆలోచన ఆయనలోను తలెత్తుతుంది. అయితే స్వామివారి పాదాలచెంత తాను సమర్పించిన బంగారుపూల పక్కనే చిన్నచిన్న మట్టిముద్దలు వుండటం చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. అత్యంత భక్తివిశ్వాసాలతో భీముడు అనే ఒక నిరుపేద భక్తుడు, కుమ్మరి పని చేస్తూ ఆ మట్టి ముద్దలనే పుష్పాలుగా భావించి తనకి సమర్పించాడని శ్రీనివాసుడు చెప్పడంతో ఆయన అజ్ఞానం తొలగిపోతుంది.

పురందరదాసు వీణను అద్భుతంగా వాయించేవాడు. అది ఆయనకి ఆ సరస్వతీదేవి ప్రసాదించిన వరంగా అంతా చెప్పుకునేవారు. ఒకసారి ఒక క్షేత్రంలో ఒక యువతి వీణవాయిస్తూ వుంటే .. భగవంతుడు బాలుడు రూపంలో వచ్చి నాట్యం చేయడాన్ని పురందరదాసు చూస్తాడు. ఆమె భగవంతుడిని మెప్పించడం గురించి మాట్లాడకుండా, సంగీతంలో ఆమెకి గల నైపుణ్యాన్ని గురించి ప్రస్తావిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ఆ యువతి చిరుమందహాసాన్నిచేస్తూ ఒక్కసారిగా సరస్వతీదేవిగా ఆయన ఎదుట సాక్షాత్కరిస్తుంది. తన అజ్ఞానాన్ని పెద్ద మనసుతో మన్నించమని ఆయన ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తాడు. ఇలా మహా భక్తులైనవారిలో మచ్చుకి కూడా అహంభావమనేది లేకుండా చేసి, నిస్వార్థమైన వారి సేవలను నిజమైన ఆనందంతో భగవంతుడు స్వీకరించాడు.


More Bhakti News