అదంతా అమ్మవారి అనుగ్రహమేనట !

గ్రామదేవతల ఆరాధన ప్రాచీనకాలం నుంచీ వుంది. ముత్యాలమ్మా .. నూకాలమ్మా .. పోచమ్మ ... పోలేరమ్మ ... అంకాలమ్మా తదితర పేర్లతో గ్రామదేవతలు పూజించబడుతూ వుంటారు. అమ్మవారి పేరు ఏదైనా ... ఏ రూపంలో దర్శనమిస్తూవున్నా ఆమె మూలరూపం ఆదిపరాశక్తి అనే భక్తులు విశ్వసిస్తూ వుంటారు. తమ గ్రామాన్ని రక్షిస్తుందనే విశ్వాసంతో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించుకుంటూ వుంటారు.

తమ పాడిపంటలను అమ్మవారే పర్యవేక్షిస్తూ ఉంటుందనీ, అనారోగ్యాల నుంచీ ... ఆపదల నుంచి ఆ తల్లే తమని కాపాడుతూ ఉంటుందని భావిస్తారు. అనునిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించడమే కాకుండా, విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకపూజలు జరిపించడం ... ఏడాదికి ఒక రోజున జాతర నిర్వహించడం చేస్తుంటారు. ఈ సందర్భంలోనే అమ్మవారిపట్లగల కృతజ్ఞతా భావంతో నైవేద్యాలు ... కానుకలు సమర్పిస్తూ వుంటారు.

కొన్ని సందర్భాల్లో గ్రామదేవతలు అనేక గ్రామాల్లోని భక్తుల విశ్వాసాన్ని కూడా అందుకుని వెలుగొందుతూ వుంటారు. అలాంటి క్షేత్రాల్లో 'మునకోళ్ల' ఒకటిగా దర్శనమిస్తూ వుంటుంది. కృష్ణా జిల్లా తిరువూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ప్రాచీనకాలం నుంచీ ఇక్కడ గ్రామదేవతగా 'అంకాలమ్మ' పూజలు అందుకుంటోంది. కొండంత అండగా నిలిచి తమని చల్లగా చూస్తున్నది అంకాలమ్మ తల్లేనని ప్రజలు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

సంపదలను ... సంతాన సౌభాగ్యాలను అంకాలమ్మ రక్షిస్తూ ఉంటుందని అంటారు. తమని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుందని చెబుతుంటారు. ఆ తల్లి అనుమతి లేకుండా ... ఆశీస్సులు అందుకోకుండా ఇక్కడ ఎవరు ఎలాంటి పనిని ఆరంభించరు. ప్రతి గురువారం రోజున, శని .. ఆదివారాల్లోను అమ్మవారిని దర్శించుకునే భక్తులసంఖ్య ఎక్కువగా వుంటుంది. అమ్మవారి అనుగ్రహాన్ని కోరి వచ్చినవాళ్లు ... ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చినవాళ్లు ఇక్కడ కనిపిస్తూ వుంటారు. ఇక్కడి అమ్మవారి సన్నిధిలో ఆచార సంప్రదాయాలే కాదు, అంతకు మించిన ప్రేమానురాగాలు ఆ తల్లిపట్ల కనిపిస్తూ వుండటం విశేషం.


More Bhakti News