సత్యనారాయణస్వామి అనుగ్రహం

విశేషమైనటు వంటి పుణ్యతిథుల్లోను ... మాసాల్లోను సత్యనారాయణస్వామి వ్రతాలు చేస్తూ వుంటారు. ఇక వివాహ సందర్భాల్లోనూ ... గృహప్రవేశ సందర్భాల్లోను ఇరుగుపొరుగువారిని పిలిచి సత్యనారాయణస్వామి వ్రతం జరుపుకుంటూ వుంటారు. సత్యనారాయణస్వామిని దర్శించినా .. పూజించినా .. వ్రతకథలు విన్నా .. ప్రసాదాన్ని స్వీకరించినా కలిగే పుణ్యం అంతా ఇంతాకాదు.

ఆ స్వామి ఆశీస్సుల కారణంగా కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక వ్రతమనేది విశేషమైన రోజుల్లో చేసుకున్నా, స్వామివారిని అనునిత్యం పూజిస్తూ వుండాలి. ప్రతి పూజామందిరంలో వుండదగినది సత్యనారాయణస్వామి చిత్రపటం. ప్రతిరోజు స్వామివారిని వివిధరకాల పుష్పాలచే అలంకరిస్తూ అర్చిస్తూ వుండాలి. తాజా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.

ఇక పౌర్ణమివంటి విశేషమైన రోజుల్లో స్వామివారికి ప్రీతికరమైనవిగా చెప్పబడుతోన్న అరటిపండ్లు ... రవ్వకేసరిని నైవేద్యంగా పెడుతూ, భక్తిశ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. స్వామిపట్లగల విశ్వాసమే సమస్తశుభాలకు ఆహ్వానం పలుకుతుంది. అంకితభావంతో స్వామివారిని అనునిత్యం సేవిస్తూ వుండటం వలన, ఆ ఇల్లు సుఖశాంతులకు నెలవుగా మారుతుంది. స్వామివారిని పూజించి ఏ కార్యంఫై బయలుదేరినా అది తప్పక విజయాన్ని సాధిస్తుంది.

సత్యనారాయణస్వామి ఆరాధన ఫలితంగా అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు ... దారిద్ర్యదుఃఖాలు దరిదాపుల్లోకి రావని స్పష్టం చేయబడుతోంది. ఎవరైతే సత్యనారాయణస్వామిని అనునిత్యం పూజిస్తూ వుంటారో, ఏదో ఒక విశేషమైన తిథిని నియమంగా పెట్టుకుని క్రమం తప్పకుండా ఆ రోజున స్వామి వ్రతాన్ని చేస్తుంటారో ఆ ఇల్లు సిరిసంపదలతోను ... సుఖసంతోషాలతోను తులతూగుతూ ఉంటుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News