రాహువుని శిక్షించిన విష్ణుమూర్తి

దేవతలు ... దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలుకుతారు. అందులో నుంచి 'అమృతం' పుట్టగానే అందరిలోనూ ఆరాటం పెరిగిపోతుంది. అమృత కలశం కోసం దేవ దానవుల మధ్య గొడవ మొదలవుతుంది. ఎవరికి వాళ్లు దానిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అమృతం దానవులకు దక్కడం వలన అనేక తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని భావించిన విష్ణుమూర్తి, అది వాళ్లకి చిక్కకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు.

అనుకున్నదే తడవుగా మోహినీరూపాన్ని ధరించి అక్కడ ప్రత్యక్షమవుతాడు. మంత్రం వేసినట్టుగా అసురులంతా మోహినీ రూపాన్ని కళ్లప్పగించి చూస్తూ ఉండిపోతారు. అమృత కలశాన్ని మించి ఆమె సౌందర్యం వాళ్లను ఆకర్షిస్తుంది. దాంతో వాళ్లు ఆమెచుట్టూ చేరతారు. ఆమె ద్వారా అమృతాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తారు. తన రూప విశేషాలతో రాక్షసులను మాయచేస్తూ, దేవతలకు అమృతాన్ని పంచుతూ వుంటుంది మోహిని.

ఆ సమయంలోనే 'రాహువు' తెలివిగా వచ్చి దేవతల వరుసలో కూర్చుంటాడు. అసురులకు అనుమానం వచ్చేలోగా తన పనిని ముగించాలనే తొందరలో వున్న మోహిని, దేవతల మధ్య కూర్చున్న రాహువుకి కూడా అమృతం పోసేస్తుంది. తన ప్రయత్నం ఫలించినందుకు ఆనందిస్తూ రాహువు అమృతాన్ని తాగుతూ వుండగా సూర్యచంద్రులు గమనించి ఆందోళన చెందుతారు.

వెంటనే ఈ విషయాన్ని మోహినీ రూపంలో గల విష్ణుమూర్తికి తెలియజేస్తారు. ఆశ్చర్యచకితుడైన విష్ణుమూర్తి వెంటనే తేరుకుని తన సుదర్శన చక్రంతో రాహువు తలను ఖండిస్తాడు. అయితే అమృతం తాగిన కారణంగా రాహువు తల ... మొండెం జీవంతోనే వుంటాయి. అలా అమృతం కోసం ఆరాటపడి విష్ణుమూర్తిచే శిక్షించబడిన రాహువు, ఛాయాగ్రహంగా పూజలు అందుకుంటూ వున్నాడు.


More Bhakti News