మల్లికార్జునుడి దర్శనమే మహద్భాగ్యం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం పేరు కనిపిస్తుంది ... అష్టాదశ శక్తి పీఠాల్లోను ఈ క్షేత్రం పేరు వినిపిస్తుంది. మల్లికార్జునుడుగా స్వామివారు ... భ్రమరాంబాదేవిగా అమ్మవారు స్వయంభువు మూర్తులుగా కొలువుదీరి వుండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా ... విశిష్టతగా చెప్పబడుతోంది. శ్రీపర్వతంపై కొలువైన ఆదిదంపతులను దర్శించుకోవడం వలన, పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షంగా సేవించిన ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.

ఇక్కడి ప్రతిరాయి శివలింగరూపాన్ని సంతరించుకున్నదిగా కనిపిస్తూ వుంటుంది. ఈ కొండపై గాలి కూడా శివనామస్మరణ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి ప్రవహించే నీరు కూడా గంగాతీర్థంతో సమానమైనదే. అనునిత్యం దేవతలు ... మహర్షులు ఇక్కడి స్వామివారినీ ... అమ్మవారిని దర్శిస్తూ వుంటారు. లోకకల్యాణ కారకుడైన శివుడు ఇక్కడి నుంచే అనేక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాడు. మరెన్నో మహిమలు చూపుతుంటాడు.

అందువలన సర్వం శివమయమేననే భావన ఈ క్షేత్ర దర్శనం చేసిన ప్రతిఒక్కరికీ కలుగుతుంది. శ్రీశైలానికిగల మరో విశిష్టత ... శిఖర దర్శనం. ఎన్నో యజ్ఞయాగాలు ... మరెన్నో తీర్థయాత్రలు ... ఇంకెన్నో దానధర్మాలు చేయడం వలన మాత్రమే మోక్షం లభిస్తూ వుంటుంది. అలాంటి మోక్షం కేవలం శ్రీశైల శిఖర దర్శనం వలన కలుగుతుందని చెప్పబడుతోంది. దీనినిబట్టి శ్రీశైలం ఎంతటి మహిమాన్వితమైన క్షేత్రమనేది అర్థంచేసుకోవచ్చు.

శ్రీశైల క్షేత్రాన్ని దర్శించాలనే ఆలోచనే సగం పాపాలను కడిగేస్తుంది. శ్రీశైల క్షేత్రం గల దిశకి తిరిగి నమస్కరించినా పుణ్యరాశి పెరిగిపోతుంది. శిఖర దర్శనం వలన జనన మరణ చక్రంలో చిక్కుకోకుండా మోక్షం లభిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో అడుగుపెట్టడానికి మించిన అదృష్టం లేదు. ఇంకా ఈ క్షేత్రాన్ని దర్శించడం వీలుకాలేదని చెప్పుకోవలసి వస్తే దానికి మించిన దురదృష్టమూ లేదు.


More Bhakti News