శిరిడీసాయి లీలావిశేషం

శిరిడీసాయి లీలలు అనేకం ... అవి భక్తులపాలిట వరాలు ... ఆశించినవారికి అందిన ఫలాలు. నలుగురూ తనని గొప్పగా చూడాలనిగానీ, తన గురించి గొప్పగా చెప్పుకోవాలనిగాని బాబా ఎలాంటి లీలలు ప్రదర్శించలేదు. తనని నమ్మినవారికి ఆయన సహాయాన్ని అందించిన తీరే మహిమలుగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఆయన మాత్రం ఎవరి విశ్వాసం వారిని రక్షిస్తూ ఉంటుందని చెప్పేవాడు.

భక్తులలోగల విశ్వాసానికి బాబా ప్రాధాన్యతను ఇచ్చినట్టు కనిపిస్తుంది. కొంతమంది బాబా లీలావిశేషాలను గురించి వినివున్నా, నిజంగా ఇతరులను కాపాడే శక్తిసామర్థ్యాలు ఆయనకి ఉన్నాయా ? అనే సంశయంతో వుండేవారు. ఇతరుల మాటను కాదనలేక .. ఒకసారి వెళ్ళొచ్చినంత మాత్రాన పోయేదేం లేదుగదా అని ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు.

అలాంటివాళ్లు తన సన్నిధిలో అడుగుపెడుతూ ఉండగానే బాబా తీవ్రమైన ఆగ్రహావేశాలను వ్యక్తం చేసేవాడు. తమ ఉద్దేశాన్ని బాబా గ్రహించినందుకు విస్తుపోతూనే వాళ్లు వెనుదిరిగేవారు. అలా సందేహపడి ఆయన అనుగ్రహానికి దూరమైనవాళ్లు .. కష్టాలతోనే సహజీవనాన్ని కొనసాగిస్తూ వుండేవాళ్లు. ఇక ఎన్ని అవాంతరాలు ఎదురైనా శిరిడీ చేరుకోవాలి ... బాబా దర్శనం చేసుకోవాలి ... తమ కష్టం ఆయనకి చెప్పుకోవాలని వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే వుండేవాళ్లు. బాబా దర్శనం వలన ... ఆయన ఆశీస్సుల వలన తమ సమస్యకి పరిష్కారం తప్పక లభిస్తుందనే విశ్వాసంతో వుండేవాళ్లు.

ఎన్నో ఇబ్బందులుపడుతూ వచ్చిన అలాంటి భక్తులను బాబా చిరునవ్వుతో పలకరించేవాడు. విశ్వాసానికి మించిన విరుగుడు ఏదీలేదని వాళ్లతో చెబుతూ ఉండేవాడు. బాబా సన్నిధిలోకి అడుగుపెట్టిన అలాంటి భక్తులకి క్షణాల్లో బాధల నుంచి విముక్తి లభిస్తూ వుండేది. అలా బాబాపై నమ్మకంతో ఆయనని దర్శించేవారు తక్షణమే ఆ సమస్య నుంచి బయటపడుతూ వుండేవాళ్లు. ఇప్పటికీ కూడా బాబాపట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగినవారికే ఆయన అనుగ్రహం దక్కుతూ ఉంటుందని భక్తులు చెబుతూ వుంటారు.


More Bhakti News