శుభాలను సూచించే స్వప్నం
సాధారణంగా కలలనేవి మనసులోని ఆలోచనలకు దృశ్యరూపాన్ని ఇస్తుంటాయి. అయితే ఒక్కోసారి ఎలాంటి మానసికపరమైన ఒత్తిడిలేకపోయినా ... ఎలాంటి ఆలోచనలు కలగకపోయినా కలలు వస్తూ వుంటాయి. అలాంటి కల ఎందుకు వచ్చి ఉంటుందనే విషయమై ఎంతగా ఆలోచించినా సమాధానం దొరకదు. మనసుని ఎంతగానో ప్రభావితం చేసే కొన్ని కలలు మాత్రమే గుర్తుంటాయి. మిగతా కలలు ఉదయం నిద్రలేచిన తరువాత పెద్దగా గుర్తుండవు.
మరికొన్ని కలలు గుర్తున్నా వాటి గురించి అంతగా పట్టించుకోకపోవడం జరుగుతూ వుంటుంది. ఇక కొంతమంది మాత్రం తమకి వచ్చిన కల గురించి ఇతరులతో చెప్పడం ... దాని ఫలితాన్ని గురించి చర్చించడం చేస్తుంటారు. అన్ని కలలు కాదుగానీ .. తెల్లవారు జామున వచ్చిన కొన్ని కలలు మాత్రం ఫలితాన్ని చూపిస్తాయని చెప్పబడుతోంది. ఒక్కోసారి భగవంతుడి నామసంకీర్తనం చేస్తున్నట్టుగా ... ఆయన భజనామృతంలో పాలుపంచుకున్నట్టుగా కల వచ్చే అవకాశం లేకపోలేదు.
ఈ విధమైన కలరావడం శుభప్రదమని అంటారు. పూర్వం ప్రతి గ్రామంలోను సాయంత్రం వేళలో ఆలయాల్లో భజన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో భజన బృందాలు సందడి చేస్తూనే వున్నాయి. భగవంతుడి నామసంకీర్తనంలో పాల్గొనడంలో కలిగే ఆనందం వేరు ... అనుభూతి వేరు. అలా ఉత్సాహంతో తనని తాను మరచిపోయి భగవంతుడి నామసంకీర్తన చేస్తున్నట్టుగా కలవస్తే అది శుభసూచకంగా చెప్పబడుతోంది. ఇక ముందు అంతామంచే జరుగుతుందనే విషయానికి ఈ స్వప్నం సంకేతంగా భావించవచ్చని స్పష్టం చేయబడుతోంది.