భక్తులను నిరాశ పరచని భగవంతుడు

కష్టమొచ్చినా ... నష్టమోచ్చినా భక్తులు రెండుచేతులు జోడించి భగవంతుడి ఎదురుగా నిలబడతారు. తాము అశక్తులమనీ ... దయచూడమని కోరుతుంటారు. తనపై భక్తులు ఉంచిన విశ్వాసానికి తగినట్టుగానే ఆయన స్పందిస్తూ వుంటాడు. తననుంచి భక్తులు ఏదైతే కోరుతూ వుంటారో, వాళ్లకి వాటిని అందిస్తూ ... ఆనందింపజేస్తూ వుంటాడు. అందరూ భక్తులే అయినప్పటికీ, భగవంతుడిపై వారికి గల విశ్వాసాన్నిబట్టి ఫలితం లభిస్తూ వుంటుంది. అందుకు అనేక నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి.

తుకారామ్ ఎంతో కాలంపాటు కష్టపడి రచించిన అభంగాలను కొంతమంది అసూయాపరుల కారణంగా ఇంద్రాణి నదిలో వదిలిపెట్టవలసి వస్తుంది. పదిమందీ పాడుకుని తరించవలసిన అభంగాలు అలా నీటిపాలు కావడం తుకారామ్ కి ఎంతో బాధ కలిగిస్తుంది.సాక్షాత్తు ఆ పాండురంగడే ఆదిశించిన కారణంగా తాను అభంగాలను రచించాడు. అలాంటి అభంగాలు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఎలా పోతాయనే సందేహం ఆయనలో తలెత్తుతుంది.

అంతే .. తన అభంగాలు తప్పనిసరిగా తనకి తిరిగి చేరతాయనే బలమైన విశ్వాసంతో ఆ నది ఒడ్డునే కూర్చుంటాడు. నీట మునిగిపోయిన అభంగాలు తిరిగి ఎలా వస్తాయని ఎంతమంది ఎన్నివిధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆయన వినిపించుకోడు.తనని నమ్మిన భక్తులను భగవంతుడు ఎప్పుడూ నిరాశపరచడనీ, తనచే ఆ స్వామి రాయించిన అభంగాలు తప్పక తిరిగివస్తాయని అంటాడు.

నిద్రాహారాలు మానేసి అక్కడే పదమూడు రోజులపాటు ఉండిపోతాడు. భగవంతుడిపై ఆయన ఉంచిన విశ్వాసం ఫలిస్తుంది. నదిలో మునిగిపోయిన అభంగాలు వాటంతటవే నీటిపై తేలుతూ ఆయన దగ్గరికి వస్తాయి. తుకారామ్ సంతోషానికి అవధులు కేకుండా పోతుంది. ఆయన ఆనందబాష్పాలచే అభంగాలు అభిషేకించబడతాయి. భగవంతుడిని బలంగా విశ్వసించిన వారెవరూ రిక్తహస్తాలతో వెనుదిరగరని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ సంఘటన కనిపిస్తూ వుంటుంది. భక్తుల హృదయ వేదికపై అనిర్వచనీయమైన అనుభూతిని ఆవిష్కరిస్తూ వుంటుంది.


More Bhakti News