కుజుడి అనుగ్రహం ఇలా లభిస్తుంది !
కుజదోషం అనే మాట వినగానే ఎవరైనా సరే ఆందోళనకి లోనవుతారు. ఎందుకంటే కుజదోషం అలాంటి ఇబ్బందులకు ... బాధలకు గురిచేస్తూ వుంటుంది. ఆ కష్టాలను తట్టుకుని నిలబడటం అంతతేలికైన పనికాదు. అందువలన ఆ దోషం నుంచి ఎలా బయటపడాలనే విషయంగా అంతా తీవ్రంగా ఆలోచన చేస్తూనే వుంటారు. కుజుడినే మంగళుడు ... అంగారకుడు అనే పేర్లతో పిలుస్తుంటారు.
కుజుడు చతుర్భుజుడై .. ఎర్రని వస్త్రాలను ధరించి 'పొట్టేలు' వాహనాన్ని అధిష్ఠించి వుంటాడు. కుజదోషం నుంచి విముక్తిని పొందాలనుకునేవాళ్లు ఆయనని శాంతింపజేయడానికి వివిధరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి కుజుడి గురించి ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. కుజుడు శిశువు దశలో వున్న సమయంలో, ఆ శిశువును భూదేవి చేరదీసి పెంచడం జరిగిందని చెప్పబడుతోంది. ఈ కారణంగా ఆయనని 'భౌముడు' అనే పేరుతో కూడా పిలుస్తుంటారు.
తల్లిగా ఆదరించిన పృథ్వీ ... కుజుడికి అధిదేవతగా చెప్పబడుతోంది. ఇక అధిష్ఠాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి చెప్పబడుతున్నాడు. ఈ కారణంగా ఇటు భూదేవిని పూజించినా, అటు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినా కుజుడు శాంతిస్తాడు. ఆయన ఎప్పుడైతే శాంతిస్తాడో అప్పుడు కుజుడిని నుంచి వస్తోన్న ప్రతికూల ఫలితాలు తగ్గుతూ పోతాయి. అందువలన కుజదోషంతో బాధపడుతోన్నవాళ్లు భూదేవినిగానీ ... సుబ్రహ్మణ్యస్వామినిగాని పూజించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుంది.