భగవంతుడు ఆశించేది భక్తిని మాత్రమే !
పరమశివుడికి రావణుడు మహాభక్తుడు. ఆదిదేవుడిని పూజించకుండా ఆయన తన దైనందిన కార్యక్రమాలను ఆరంభించేవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లోను శివుడిని పూజించడం మానుకునేవాడు కాదు. అలాంటి రావణుడు ఒకానొక సందర్భంలో 'కైలాసగిరి'ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. తనంతటి పరాక్రమవంతుడు ... శివభక్తుడు మరెవరూ లేరనే అహంభావమే అతనితో ఆ పని చేయిస్తుంది.
ఈ విషయంలో నందీశ్వరుడు ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా రావణుడు వినిపించుకోడు. కైలాస పర్వతాన్ని రావణుడు ఎత్తడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా అది కదులుతుంది. భయంకరమైన శబ్దంతో జరిగిన ఆ కదలిక పార్వతీదేవిని విస్మయానికి గురిచేస్తుంది. జరిగిన సంఘటనకి కారకుడు రావణుడనే విషయం శివుడు గ్రహిస్తాడు.
రావణుడు అనునిత్యం ... అనుక్షణం తనని ఆరాధించే మహాభక్తుడనే విషయం శివుడికి తెలుసు. తనని మించిన భక్తుడు ... బలవంతుడు ఎవరూ లేరనే ఉద్దేశంతోనే అతనలా ప్రవర్తిస్తున్నాడనే విషయం విశ్వనాథుడికి అర్థమైపోతుంది. దాంతో రావణుడి అహంభావాన్ని అణచడం కోసం ఆయన తన కాలి బొటనవ్రేలుతో కైలాస పర్వతాన్ని అదిమిపడతాడు. అంతే .. ఆ పర్వతం అంతకుమించి ఇంచు కూడా పైకి లేవకపోగా, అంతకంతకు బరువు పెరుగుతూ యథాస్థానాన్ని ఆక్రమిస్తుంది.
దాంతో ఆ పర్వతం క్రింద చేతులు నలిగిపోతూ ఉండటంతో రావణుడు బాధతో విలవిలలాడిపోతాడు. చేసిన పొరపాటు తెలుసుకుని భక్తితో సదాశివుడిని స్తుతిస్తాడు. శాంతించిన శివుడు, రావణుడికి ప్రత్యక్ష దర్శనమిచ్చి కావలసిన వరాన్ని అనుగ్రహిస్తాడు. అహంభావం వున్నవాళ్లు భగవంతుడిచే అణచివేయబడతారనీ, అసమాన భక్తిశ్రద్ధలు మాత్రమే ఆయన అనుగ్రహాన్ని సంపాదించిపెట్టగలవనే విషయాన్ని ఈ సంఘటన స్పష్టంచేస్తూ వుంటుంది.