ఆపదల నుంచి కాపాడే గాయత్రీమాత
గాయత్రీ అంటేనే రక్షించునది అనే అర్థం చెప్పబడుతోంది. తనని జపించినవారిని గాయత్రీ సదా కాపాడుతూ వుంటుంది. వేదాలకు మూలమైన గాయత్రిని సంధ్యా సమయంలో జపించడం వలన దీనిని 'సంధ్యావందనం' గా కూడా చెబుతుంటారు. ఉదయం సంధ్య ... మధ్యాహ్న సంధ్య ... సాయం సంధ్య సమయాల్లో గాయత్రీ మంత్రజపం చేస్తూ వుంటారు. ఈ మంత్రం అత్యంత శక్తిమంతమైనదిగా ... మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది.అందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తూ వుంటాయి.
ఒక అర్చకుడు త్రిసంధ్యలలోను గాయత్రీ చేసుకునేవాడు. అనునిత్యం నియమనిష్ఠలను పాటిస్తూ గాయత్రిని పూజిస్తూ ఉండేవాడు. ఒకసారి పనిమీద పొరుగూరికి వెళ్లిన అతను తన గ్రామ పొలిమేరలోకి ప్రవేశించగానే ముగ్గురుదుండగులు ఆతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. తనకి శత్రువులు ఎవరూ లేరు కనుక, ఎవరో అనుకుని తనని వాళ్లు వెంటాడుతున్నారనే విషయం ఆ అర్చకుడికి అర్థమైపోతుంది.
కానీ వెంటాడుతోన్నవాళ్లు ఆ విషయాన్ని చెప్పే అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. దాంతో తనని వాళ్ల బారినుంచి కాపాడవలసిందిగా ఆ అర్చకుడు గాయత్రీదేవిని తలచుకుంటాడు. అంతే ఆ పక్కనే వున్న పొలంలో పనిచేస్తున్న కూలీలు కొంతమంది ఈ దృశ్యాన్ని చూసి గట్టుపైకి పరిగెత్తుకు వస్తారు. కొడవళ్లతో ... కర్రలతో ఆ ముగ్గురు వ్యక్తులను అడ్డుకుంటారు. తనని వెంటాడుతూ వచ్చినవాళ్లు పారిపోతుండటం చూసిన అర్చకుడు తేలికగా ఊపిరి పీల్చుకుంటాడు.
పంటకాలువలో ముఖం కడుక్కుని కృతజ్ఞతలు చెప్పడం కోసం ఆ పొలం దగ్గరికి వస్తాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో, వాళ్లు ఆసామి ఇంటికి వెళ్లి ఉంటారని భావించి అక్కడికి వెళతాడు. జరిగిన సంఘటన గురించి ఆసామితో వివరంగా చెబుతాడు. ఆయన పొలంలో పనిచేస్తోన్న కూలీలే తన ప్రాణాలను కాపాడారనీ, వాళ్లకి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చానని అంటాడు. ఆ మాటకు ఆయన ఆశ్చర్యపోతూ, తన పొలంలో ప్రస్తుతం పనేమీ జరగడంలేదనీ, తానెవరినీ పనికి పెట్టలేదని చెబుతాడు.
దాంతో అదంతా గాయత్రీదేవి మహిమనే విషయం ఆ అర్చకుడికి అర్థమవుతుంది. తనని కాపాడటం కోసం అమ్మవారు అన్ని రూపాలను ధరించడం అతనికి మహా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తనని రక్షించిన అమ్మవారికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్న ఆ అర్చకుడు, గాయత్రీ మంత్రానికి గల మహాత్మ్యాన్ని గురించి ఇప్పటికీ ఇతరులతో కలిసి పంచుకుంటూనే వుంటాడు. అమ్మవారి మహిమను చాటిచెప్పే ఈ సంఘటన, చాలాకాలం క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండల పరిధిలో గల ఒక గ్రామంలో జరిగింది.