గణపతి ఆరాధన వలన కలిగే ఫలితం
దేవతల సంకల్పం నెరవేరాలన్నా ... మహర్షుల తపస్సు ఫలించాలన్నా ... మహారాజులు విజయాలను దక్కించుకోవాలన్నా ... సాధారణ ప్రజలు శుభాలను పొందాలనుకున్నా అందుకు వినాయకుడి అనుగ్రహం ఉండవలసిందే. వినాయకుడిని పూజించకుండా ఏ కార్యం ఫలించదు ... ఏ విజయం సిద్ధించదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచీనకాలం నుంచి వినాయకుడి ఆరాధన కనిపిస్తుంది.
వినాయకుడు ప్రధానదైవంగా ఆవిర్భవించిన ప్రదేశాలు మహిమాన్విత క్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. అంతేకాదు ఆలయమేదైనా ఆ ప్రాంగణంలో వినాయకుడు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు. వినాయకుడు కొలువైవుంటే, అది ఏవారమైనా ఆ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. వినాయకుడిని పూజిస్తూ వుండటం వలన ఆయన అనుగ్రహం ఎప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పబడుతోంది.
ధర్మబద్ధంగా ఎవరు దేనినైతే ఆశించి పూజిస్తారో, అది నెరవేరేలా వినాయకుడు అనుగ్రహిస్తుంటాడు. ఇతరులకు హాని కలిగించే ఉద్దేశం లేకుండా, మంచిమనసుతో తలపెట్టే పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఆయన చూస్తుంటాడు. సాధారణ మానవులే కాదు .. లోకకల్యాణం కోసం దేవతలు ఏ కార్యాన్ని తలపెట్టినా అది ఆయన పూజతోనే ఆరంభమయ్యేది. ఆయనని ఆరాధించకుండా ఆరంభించే కార్యాల్లో దేవతలు సైతం ఆటంకాలు ఎదుర్కోక తప్పలేదు.
దేవదానవులు క్షీరసాగర మథనం జరుపుతూ వుండగా, హఠాత్తుగా మంధరపర్వతం సముద్రంలోకి జారిపోతుంది. నిరాశా నిస్పృహలకు లోనైన దేవతలు శ్రీహరికి పరిస్థితిని తెలియజేస్తారు. గణపతిని ఆరాధించకుండా ఆ కార్యాన్ని ఆరంభించడం వల్లనే అలా జరిగిందనీ, ఆయనని పూజించి తిరిగి ప్రయత్నించమని శ్రీమహావిష్ణువు సెలవిస్తాడు. జరిగిన తప్పు తెలుసుకుని వాళ్లు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. శ్రీమహావిష్ణువు కూర్మరూపంలో మందరగిరిని వీపుపై మోస్తూ వుండగా, దానితో సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదిస్తారు.
వినాయకుడి అనుగ్రహమే కార్యసిద్ధిని కలిగిస్తుందనీ, కావలసిన విజయాన్ని సాధించి పెడుతుందని చెప్పడానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. అందుకే అనుదినం వినాయకుడిని పూజిస్తూ వుండాలి ... ఆయనకి ఇష్టమైన కుడుములు .. ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తూ వుండాలి. ఆ స్వామి అనుగ్రహంతో సకల శుభాలను పొందుతూ వుండాలి.