ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని అభిషేకిస్తే చాలు

సుబ్రహ్మణ్యస్వామి కొన్నిక్షేత్రాల్లో విగ్రహరూపంలోను ... కొన్నిక్షేత్రాల్లో పుట్టరూపంలోను ... మరికొన్ని క్షేత్రాల్లో సర్పరూపంలోను పూజలు అందుకుంటూ వుంటాడు. చాలా అరుదుగా లింగరూపంలోను దర్శనమిస్తూ వుంటాడు. అలాంటి సుబ్రహ్మణ్యస్వామి కొన్నిక్షేత్రాల్లో ప్రధానదైవంగాను ... మరికొన్నిచోట్ల పరివారదేవతగాను కనిపిస్తూ వుంటాడు. ఇక స్వామివారు ఎక్కడ కొలువై వుంటే అక్కడ మహిళా భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది.

సుబ్రహ్మణ్యస్వామివారిని పూజిస్తే నాగదోషం తొలగిపోతుందనీ, సంతానభాగ్యం లభిస్తుందనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి వుంది. అందువలన ఈ క్షేత్రాలను మహిళా భక్తులు ఎక్కువగా దర్శిస్తూ వుంటారు. అలాంటి క్షేత్రాల జాబితాలో 'ఊడిమూడి' ఒకటిగా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి గోదావరి నదీ సమీపంలో గల శివాలయంలోనే సుబ్రహ్మణ్యస్వామి కొలువుదీరి కనిపిస్తూ వుంటాడు. ప్రాచీనకాలంనాటి విశేషాలను సంతరించుకున్న క్షేత్రం ఇది.

ఇక్కడి స్వామి మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తుంటారు. సర్పదోషంతో బాధలుపడుతోన్నవాళ్లు ... సంతానభాగ్యం కోరుకునేవారు స్వామివారికి పూజాభిషేకాలు జరిపిస్తుంటారు. స్వామివారిని అభిషేకించడం వలన పాపాలు .. దోషాలు నశిస్తాయని అంటారు. సుబ్రహ్మణ్యస్వామికి ప్రీతికరమైనవిగా చెప్పబడుతోన్న అరటిపండ్లను ... పాయసాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు. అలా స్వామివారిని పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరినవాళ్లు ఎంతోమంది వున్నారని చెబుతుంటారు.

మనోభీష్టం నెరవేరిన తరువాత మళ్లీ దర్శించుకుంటామని మొక్కుకున్నవాళ్లు ఆ విషయాన్ని మరిచిపోతే, స్వప్నం ద్వారా గుర్తుచేయడం ఇక్కడి స్వామివారి ప్రత్యేకతని అంటారు. స్వామివారి అనుగ్రహాన్ని పొందినవాళ్లు తమ పిల్లలకు ఆయనపేరు కలిసివచ్చేలా పేరుపెడుతూ వుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి ప్రత్యేకపూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఆయురారోగ్యాలను ... సంతాన సౌభాగ్యాలను ప్రసాదించమని ఆ స్వామిని ప్రార్ధిస్తూ వుంటారు ... ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News