సరస్వతీదేవి పూజా ఫలితం
ధనమనేది ఖర్చుచేస్తున్నాకొద్దీ తరిగిపోతూ వుంటుంది. ధనం వలన వచ్చే గౌరవం కూడా ఆ ధనంలేని రోజున కనిపించకుండా పోతుంది. కానీ విద్యాధనమనేది ఇతరులకి పంచుతున్నాకొద్దీ పెరుగుతూ వుంటుంది. విద్య వలన వచ్చే గుర్తింపు కడవరకూ కొనసాగుతూ వుంటుంది. విద్యావంతుడు ఏ ప్రాంతానికి వెళ్లినా పదిమందిచే గుర్తించబడతాడు ... గౌరవించబడతాడు. ఇలా సంపదలకు ... శాశ్వతమైనటు వంటి కీర్తిప్రతిష్ఠలకు కారణమైన విద్యను ప్రసాదించేది సాక్షాత్తు సరస్వతీదేవియే.
అమ్మవారు తెల్లని వస్త్రాలను ధరించి ప్రశాంతమైన వదనంతో దర్శనమిస్తూ వుంటుంది. సకలసంపదలకు పుట్టినిల్లు అయిన అమ్మవారు ఎంతో అణకువగా కనిపిస్తూ వుంటుంది. తన అనుగ్రహంతో విద్యావంతులైనవాళ్లు కూడా అదే అణకువను కలిగివుండాలనే సందేశాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. పాలలో కలిసిన నీరును వేరుచేసే 'హంస' అమ్మవారి వాహనంగా కనిపిస్తుంది. విద్య అనే సాధనం అజ్ఞానాన్ని అలా వేరుచేస్తుందని చెప్పబడుతోంది.
అమ్మా అని ఆ తల్లి ఎదుట నిలిచి ప్రార్ధిస్తే 'అక్షర భిక్షను' ప్రసాదిస్తుంది. అక్షరమంటే నశింపులేనిది అనే అర్థం చెప్పబడుతోంది. అలాంటి అక్షరాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఆ అక్షరమే అఖండజ్యోతిలా జ్ఞానమనే వెలుగును వెదజల్లుతూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది. సంగీత సాహిత్యాది కళలలో రాణించడమనేది కూడా అమ్మవారి అనుగ్రహంతో జరిగేదే. అందువల్లనే అమ్మవారిని అనునిత్యం పూజిస్తూ వుండాలి. అమ్మవారి నామాన్ని అంకితభావంతో పఠిస్తూ మానసికంగా ఆ తల్లి సన్నిధిలో వుండాలి.
అమ్మవారికి ప్రీతికరమైన తెల్లని పుష్పాలతో పూజిస్తూ, పాలు .. వెన్న .. పటికబెల్లం .. పాయసం నైవేద్యంగా సమర్పిస్తూ వుండాలి. ఇలా సరస్వతీదేవిని ఆరాధిస్తూ వుండటం వలన జ్ఞానసిద్ధి కలుగుతుంది ... జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రతిభాపాటవాలకు తగినగుర్తింపు లభిస్తుంది. సంపదలు ... సత్కారాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే అదంతా తన గొప్పతనమేనని అనుకోకుండా, అమ్మవారి అనుగ్రహ ప్రభావం మాత్రమేనని భావిస్తూ వుండాలి. తన వున్నతకి ఆ తల్లి కరుణాకటాక్షాలే కారణమంటూ మరింత భక్తిశ్రద్ధలతో సేవిస్తూ వుండాలి.