శ్రేయస్సును కోరేవారిని వదులుకోకూడదు
శ్రేయస్సును కోరేవారు ఎప్పుడూ కూడా హితవు చెబుతూ వుంటారు. ధర్మాన్ని విస్మరిస్తున్నప్పుడు హెచ్చరిస్తూ వుంటారు. అధర్మమార్గం దిశగా వేసే అడుగు పతనంవైపు తీసుకువెళుతుందని పదేపదే చెబుతుంటారు. అలాంటివారి మాటను వినడం వలన మంచి జరుగుతుంది. అహంభావంతో వారిని దూరం చేసుకోవడం వలన తీర్చుకోలేని నష్టం వాటిల్లుతుంది. రావణుడు ... దుర్యోధనుడు వంటివారిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సీతను అపహరించడం అధర్మమనీ ... ఆమెని రాముడికి అప్పగించి శరణు కోరమని విభీషణుడు ఎన్నోవిధాలుగా రావణుడికి హితవు చెబుతాడు. విభీషణుడి హితవాక్యాలు రావణుడికి ఎంతమాత్రం రుచించవు. అందువలన అతను విభీషణుడి మాటలను కొట్టిపారేయడమే కాకుండా అతణ్ణి అవమానపరచి పంపేస్తాడు. దాంతో ధర్మ మార్గంపట్ల అనురక్తుడై వుండే విభీషణుడు శ్రీరాముడి పాదాలను ఆశ్రయిస్తాడు. శ్రేయస్సును కోరే విభీషణుడిని దూరంచేసుకోవడంతోనే రావణుడి పతనం ఆరంభమవుతుంది.
ఇక పాండవుల విషయంలో కౌరవుల వైఖరిని 'విదురుడు' తప్పుబడతాడు. అతని ధర్మోపదేశం కౌరవులను ఎంతమాత్రం ప్రభావితం చేయలేకపోతుంది. అతను పాండవుల తరఫున మాట్లాడుతున్నాడనే అనుకుంటారుగానీ, తమ మంచికోరి చెబుతున్నాడని భావించలేకపోతారు. విదురుడి ధర్మనిరతి గొప్పదనే విషయం తెలిసినప్పటికీ, ఈ విషయంలో అతని హితవచనాలను పక్కనపెట్టి, నిర్మొహమాటంగా అతణ్ణి అక్కడి నుంచి పంపించివేస్తారు. ఆ విధంగా తమ శ్రేయస్సును కోరుకునే విదురుడిని వాళ్లు దూరం చేసుకుంటారు. ఫలితంగా పతనం దిశగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అందుకే శ్రేయస్సును కోరుకునేవారిని ఎలాంటి పరిస్థితుల్లోను దూరంచేసుకోకూడదని పెద్దలు చెబుతుంటారు.