అందరినీ రక్షించువాడు హనుమంతుడే

సీతారాముల గురించిన ఆలోచన ఎవరైతే చేస్తూ ఉంటారో, వాళ్ల యోగక్షేమాల గురించిన ఆలోచన హనుమంతుడు చేస్తుంటాడు. రామనామాన్ని ఎవరైతే స్మరిస్తూ వుంటారో, వాళ్లను హనుమంతుడు సదారక్షిస్తూ వుంటాడు. ఎక్కడైతే రాముడి భజనలు జరుగుతూ ఉంటాయో, అక్కడికి ఏదో ఒక రూపంలో హనుమంతుడు వస్తుంటాడు. అడుగడుగునా రాముడిని సేవిస్తూ వచ్చిన హనుమంతుడు, ఆయన భక్తులను అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు. అందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తూ వుంటాయి.

రామభక్తుడైన పోతన భాగవత రచన పూర్తిచేస్తాడు. తనకి ఆ గ్రంధాన్ని అంకితం ఇవ్వడానికి పోతన నిరాకరించడంతో, బలవంతంగానైనా దానిని సొంతచేసుకోవాలనే ఉద్దేశంతో మహారాజు సింగభూపాలుడు తన సైనికులను పంపుతాడు. రామభక్తుడైనటువంటి పోతన కోసం హనుమంతుడు ఆ గ్రంధానికి రక్షకుడిగా నిలుస్తాడు. దాని దరిదాపులకు కూడా ఎవరినీ రానీయకుండా తరిమికొడతాడు.

అలాగే తులసీదాస్ రచించిన 'రామచరిత్ మానస్' ను అపహరించడానికి కొంతమంది పన్నాగం పన్నితే, వాళ్ల ప్రయత్నాన్ని హనుమంతుడు విఫలం చేస్తాడు. మళ్లీ తులసీదాస్ జోలికి రాకుండా వాళ్లకి తగినవిధంగా బుద్ధిచెబుతాడు. త్యాగయ్య భక్తికి మెచ్చి సంగీత ప్రధానమైన 'స్వరార్ణవం' అనే గ్రంధాన్ని నారదమహర్షి ద్వారా సరస్వతీదేవి పంపుతుంది. డబ్బుకి ఆశపడి త్యాగయ్య సోదరుడైన 'జపేశుడు' అతని భార్య కలిసి ఆ గ్రంధాన్ని ఇతరులకి అప్పగించడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలోను హనుమంతుడు వాళ్లను అడ్డుకుంటాడు. దైవప్రసాదితమైన ఆ గ్రంధం రామభక్తుడైనటువంటి త్యాగయ్యకి దూరం కాకుండా కాపాడతాడు.

ఇలా ఎందరో మహానుభావులు రాముడిని పూజిస్తూ హనుమంతుడి అనుగ్రహాన్ని పొందారు. అలా రాముడిని సదా సేవిస్తూ వుండే భక్తులను హనుమంతుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన సంఘటనలు అనేకం కనిపిస్తూ వుంటాయి. శ్రీరాముడిని సేవిస్తేచాలు ... హనుమంతుడి అనుగ్రహం లభిస్తుందనే విషయాన్ని ఆవిష్కరిస్తూ వుంటాయి.


More Bhakti News