అనారోగ్యాలు తొలగించే ఆంజనేయుడు
హనుమంతుడి అనుగ్రహాన్ని పొందడం చాలాతేలిక. అసమానమైన భక్తివిశ్వాసాలతో ఆయనని ఆరాధిస్తూ ఉండాలేగాని, అలాంటివారిని ఆయన నీడలా అనుసరిస్తూ ఆపదల నుంచి గట్టెక్కిస్తూ వుంటాడు. తనని పూజిస్తే మురిసిపోయే హనుమంతుడు, రామనామం వింటేచాలు పరవశించిపోతుంటాడు. తనని పూజించే భక్తులను ... రాముడిని ఆరాధించే భక్తులను ఆయన సదారక్షిస్తూ వుంటాడు.
అందువల్లనే అనేక ప్రాంతాలలో ఆయన ఆలయాలు భక్తజన సందోహంతో కళకళలాడుతూ వుంటాయి. అలా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న హనుమంతుడు మనకి 'అమృత్ నగర్'లో దర్శనమిస్తూ వుంటాడు. నల్గొండ జిల్లా 'ఆళ్లగడప' సమీపంలో ఈ ఆలయం కనిపిస్తూ వుంటుంది. చాలాకాలంగా ఇక్కడ 'భక్తాంజనేయస్వామి' కొలువై వున్నాడు.
ఇక్కడి స్వామివారిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తులు చెబుతుంటారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోన్నవాళ్లు స్వామివారిని దర్శించుకోవడం వలన, వెంటనే ఫలితం కనిపిస్తుందని అంటారు. మంగళవారాల్లో హనుమంతుడిని పూజించడం వలన కుజదోషం ... శనివారాల్లో అర్చించడం వలన శనిదోష ప్రభావం తగ్గుముఖం పడుతుందని చెప్పబడుతోంది.
అందువలన ఈ వారాల్లో స్వామివారిని భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఇక్కడికి దగ్గరలోనే వ్యవసాయ వాణిజ్య సముదాయం వుండటం వలన, ఆ లావాదేవీలు జరపడానికి వచ్చినవాళ్లు స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. ఆయన అనుగ్రహాన్ని కోరుతుంటారు. స్వామివారి సిందూరాన్ని నుదుటిపై ధరించడం వలన, దుష్టశక్తుల ప్రభావం ఉండదనీ, దుస్వప్న దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు.