దైవానుగ్రహాన్ని సదా కోరుతుండాలి
ఉదయాన్నే నిద్రలేచినది మొదలు ఎవరి దైనందిన కార్యక్రమాల్లో వాళ్లు నిమగ్నులవుతుంటారు. ఈ క్రమంలో మాటలద్వారా గానీ ... చేతలద్వారా గాని ఇతరుల మనసుకి కష్టం కలిగించడం జరుగుతూ వుంటుంది. తాము తీసుకునే కొన్ని నిర్ణయాలు తమకి సరైనవిగానే అనిపించినప్పటికీ, ఒక్కోసారి ఆ నిర్ణయం ఫలితంగా ఇతరులకు ఇబ్బందులు కలుగుతుంటాయి. అందువలన తాము చేస్తున్న పని ధర్మమైనది అవునా కాదా అనే విషయాన్ని ఒకటికి రెండుమార్లు ఆలోచన చేస్తూ వుండాలి.
ఎందుకంటే తెలిసి చేసినా ... తెలియక చేసినా పాపానికి ఫలితం అనుభవించక తప్పదు. అందువలన సాధ్యమైనంత వరకూ తమ వలన ఎవరికి ఎలాంటి కష్టనష్టాలు కలగకుండా చూసుకోవాలి. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందువలన ఈ విషయంలో భగవంతుడి అనుగ్రహాన్ని కోరుకోవాలి. ఆ రోజున తమ వలన ఎవరికీ ఎలాంటి బాధకలగకుండా ఉండేలా చూడమని ప్రార్ధించాలి. ఇతరులకి ఇబ్బంది కలిగించని విధంగా ... వాళ్ల జీవితాలు ఆనందమయంగా ఉండేలా వ్యవహరించే జ్ఞానాన్ని తనకి ప్రసాదించమని కోరాలి.
అదే విధంగా నిద్రకి ఉపక్రమించే సమయంలోను, ఆ రోజున తెలిసీతెలియక తాము ఎవరినైనా బాధపెట్టినట్టయితే మన్నించమని భగవంతుడిని వేడుకోవాలి. ఈ విధంగా దైవానికి విధేయులై వుండటం వలన సహజంగానే దయ .. జాలి .. ప్రేమ .. కరుణ వంటివి పెరుగుతూ వుంటాయి. కఠినంగా కాకుండా సున్నితంగా వ్యవహరించడం అలవాటు అవుతుంది. ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తోన్నవారిని ఎలాంటి పరిస్థితుల్లోను బాధపెట్టకూడదనే విశ్వాసం బలపడుతుంది. ఫలితంగా అలాంటివారు పాపాలకు దూరమై భగవంతుడి అనుగ్రహానికి చేరువవుతుంటారు.