అన్నపూర్ణాదేవి ఆరాధనా ఫలితం

అమ్మనిమించిన దైవం లేదు ... అమ్మ అందించే అనురాగాన్ని మరెవరూ అందించనూ లేరు. ఆకలేస్తే అమ్మగుర్తుకు వస్తుంది. ఆపదలో వున్నప్పుడు ... ఆవేదనతో వున్నప్పుడు అమ్మ దగ్గరుంటే బాగుండనిపిస్తుంది. ఎన్నికష్టాలకైనా ... బాధలకైనా అమ్మ ఓదార్పు ఒక ఔషధంలా పనిచేస్తుంది. అందుకే అమ్మవుంటేచాలు అన్నీ ఉన్నట్టేనంటారు. అమ్మవున్నవాడికంటే అదృష్టవంతుడు ... ఐశ్వర్యవంతుడు మరొకరు లేరంటారు.

అలాంటి అమ్మలగన్న అమ్మగా ఆదిపరాశక్తి కనిపిస్తుంది. అమ్మవారు అనేక రూపాలతో ... నామాలతో తన భక్తులకు దర్శనమిస్తూ వుంటుంది. అలా తన బిడ్డలను రక్షించుకోవడం కోసం ... వాళ్ల పోషణకి అవసరమైనవి అందించడం కోసం అమ్మవారు ధరించిన రూపమే 'అన్నపూర్ణాదేవి'. ఈ పేరుతో అమ్మవారు పాత్రను ... గరిటెను పట్టుకుని తన బిడ్డల ఆకలితీర్చడానికి సిద్ధంగావున్న తల్లిగా దర్శనమిస్తూ వుంటుంది. ప్రశాంతమైన వదనంతో ... అనురాగం నిండిన చిరునవ్వుతో పలకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఆ తల్లి కొలువైన ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగానే వుంటుంది. ఇక పూజామందిరంలో అమ్మవారి చిత్రపటాన్ని వుంచి పూజించే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అన్నపూర్ణాదేవిని దయగలతల్లిగా చెప్పుకుంటూ వుంటారు. ఆ తల్లిని పూజించడం వలన సమస్తపాపాలు నశిస్తాయి. సమస్యలను ... బాధలను నివారించి ఆనందాలను అందిస్తుంది. ఎవరైతే నిత్యం అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తూ వుంటారో, ఆ తల్లి నామాన్ని స్మరిస్తూ వుంటారో అలాంటివారికి ఎలాంటి కొదవలేకుండా అన్నపానియాలను సమకూర్చుతూ వుంటుంది. ధనధాన్యాలతో ఆ ఇల్లు తులతూగుతూ వుంటుంది. సకలశుభాలకు నిలయంగా వెలుగొందుతూ వుంటుంది.


More Bhakti News