విశ్వాసమే భగవంతుడిని రప్పిస్తుంది
భగవంతుడు పరమ దయామయుడు ... ఆయన చల్లనిచూపుల నీడలో అందరికీ ఆశ్రయం లభిస్తుంది. ఎవరైతే ఆయనని విశ్వసిస్తూ ఉంటారో, అవసరంలోను .. ఆపదలోను వాళ్లకి ఆయన అనుగ్రహం అందుతూనే వుంటుంది. అందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తుంటాయి. పాండవులకు శ్రీకృష్ణుడు ఒక మార్గదర్శిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ఆయన చూపిన ధర్మమార్గంలోనే పాండవులు నడచుకుంటూ వుండేవారు.
ద్రౌపది ఒక సోదరిగా కృష్ణుడిని ఎంతగానో అభిమానిస్తూ ... దైవంగా విశ్వసిస్తూ వుండేది. కష్టకాలంలో ఆయనని ఆమె తప్పక తలచుకుంటూ వుండేది. ఒక సోదరుడిగా ఆమెని ఆయన ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండేవాడు. అలాంటి ద్రౌపదిని నిండుసభలో పరాభవించడానికి కౌరవులు ప్రయత్నిస్తారు. ద్రౌపదిని వివస్త్రను చేయమన్న దుర్యోధనుడి మాటను దుశ్శాసనుడు ఆచరణలో పెడతాడు. జూదంలో ఓడిన పాండవులు, ద్రౌపదిని పరాభవించమన్న సుయోధనుడినీ ... అతని ఆదేశాన్ని పాటిస్తోన్న దుశ్శాసనుడిని నిలువరించలేకపోతారు.
మంచి - చెడు తెలిసిన కురువృద్ధులు కూడా మౌనం వహిస్తారు. కాపాడవలసిన వాళ్లంతా నిస్సహాయులుగా మారిపోవడంతో, ఇక తనను రక్షించువాడు ఆ కృష్ణ పరమాత్ముడు మాత్రమేనని ద్రౌపది విశ్వసిస్తుంది. తనని కాపాడమంటూ కన్నీళ్లతో వేడుకుంటుంది. అంతే క్షణాల్లో శ్రీకృష్ణుడు తన లీలావిశేషం చేత ద్రౌపది మానసంరక్షణ చేస్తాడు. ద్రౌపదిని పరాభవించాలనుకున్న కౌరవుల దుష్టప్రయత్నం నెరవేరకుండా అడ్డుపడతాడు. ధర్మమార్గాన్ని ఆశ్రయించినవారిని అది సదారక్షిస్తూ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాడు. ధర్మాత్ముల విశ్వాసానికి ప్రతిఫలంగా భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుందనే విషయాన్ని ఈ లోకానికి మరోమారు స్పష్టం చేస్తాడు.