అలా నాగదేవత అనుగ్రహించిందట !
నాగసర్పాలను దేవతగా భావించి పూజించడం అనాదికాలం నుంచి వుంది. నాగదేవతను ఆరాధించడం వలన పంటలు బాగాపండుతాయనీ, సంతానభాగ్యం కలుగుతుందని విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే నాగదేవతలు ప్రధాన దేవతలుగా ... పరివారదేవతలుగా ఆలయాల్లో పూజాభిషేకాలు అందుకుంటున్నారు. నాగపంచమి ... నాగులచవితి .. సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పండుగలలో అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించబడుతున్నారు.
కొన్ని క్షేత్రాలను దర్శిచినప్పుడు అక్కడ నాగదేవత స్వయంభువుగా ఆవిర్భవించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుస్తూ వుంటాయి. అప్పుడు ఆ క్షేత్రం మహిమాన్వితమైనదనే విషయం అర్థమైపోతుంటుంది. ఇప్పటికీ అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వుంటాయి. అందుకు నిదర్శనంగా 'గంటి' గ్రామం కనిపిస్తూ వుంటుంది. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం పరిధిలో ఈ గ్రామం కనిపిస్తుంది. రావులపాలెం సమీపంలో గల 'ఈతకోట' నుంచి ఈ గ్రామానికి చేరుకోవడం చాలాతేలిక.
కొంతకాలం క్రితం ఈ గ్రామ సమీపంలోని ఒక ప్రదేశంలో దివ్యమైన వర్చస్సును కలిగివున్న నాగుపాము ఒకటి తిరుగుతూ ఉండేదట. అది ఎవరికీ ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా ఒకే ప్రదేశంలో ఉంటూ వుండటం అక్కడివారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఒక యువతిని నాగదేవత ఆవహించి, తనకి ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి పూజలు జరిపించమని గ్రామస్తుల సమక్షంలో చెప్పిందట. తనని కొలచినవారిని రక్షిస్తూ ఉంటాననీ, కోరిన వరాలను ప్రసాదిస్తూ ఉంటానని సెలవిచ్చిందట.
చాలారోజులుగా ఒకే ప్రదేశంలో అందరికీ కనిపించిన ఆ సర్పం, అలా యువతి ద్వారా మాట్లాడించిన దగ్గర నుంచి ఎవరికీ కనిపించలేదట. వరాలను ప్రసాదిస్తానని మాట ఇచ్చింది కనుక 'వరనాగదేవత' పేరుతో గ్రామస్తులు నాగదేవత ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాగదేవత ఇక్కడ ప్రత్యక్షంగా వుండి అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పింది కనుక, అనతికాలంలోనే ఈ క్షేత్రం భక్తులపాలిట కొంగుబంగారమవుతుందని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.