అహంభావం లేనివారికే అనుగ్రహం దక్కుతుంది
ఒకసారి బాబా కోసం కొంతమంది శ్రీమంతులు ఆయన మశీదుకి వస్తారు. ఆ సమయంలో బాబా అక్కడ లేకపోవడంతో, ఆయన సహచరులను అడుగుతారు. బాబా భిక్షకు వెళ్లాడనీ, ఆయన తిరిగిరావడానికి కొంతసమయం పడుతుందని వాళ్లు సమాధానమిస్తారు. బాబా కోసం ఎదురుచూస్తూ కూర్చునే పరిస్థితి లేదన్నట్టుగా వాళ్లు ఇబ్బంది పడిపోతారు. తప్పదన్నట్టుగా వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ వుంటారు.
అంతలో బాబా మశీదుకి తిరిగివస్తాడు. వచ్చినవాళ్లను చూస్తూనే .. మళ్లీ వెంటనే వస్తానంటూ తన సహచరులతో చెప్పి బయటికివెళతాడు. దాంతో ఆయన కోసం వచ్చిన వాళ్లు కొంత అసహనానికి లోనవుతారు. కొంతసేపటికి తిరిగి వచ్చిన బాబా, వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేయకుండా తనకి సంబంధించిన ఏవో పనులు చేసుకోసాగాడు. వచ్చిన వాళ్లు తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
బాబా ధోరణి వెనుక బలమైన కారణమేదో ఉంటుందనే విషయం ఆయన సహచరులకు తెలుసు. అయినా వాళ్ల విషయంలో ఆయన అలా ప్రవర్తించడానికి కారణమేమిటని అడుగుతారు. తనని వాళ్లు దర్శించుకోవడం వలన తనకి మరింత గొప్పపేరు వస్తుందని వాళ్లు భావించినట్టు బాబా చెబుతాడు. వాళ్లు తమ అహంభావాన్ని కూడా మూటగట్టుకుని తెచ్చారనీ, అందువలన తన కోసం నిరీక్షించలేకపోయారని అంటాడు.
దేనిని ఆశించి వాళ్లు వచ్చారో తనకి తెలుసనీ, కానీ దానిని పొందే అర్హత వాళ్లకు లేదని అంటాడు. అయినా వాళ్లలో మార్పు వస్తుందేమోననే ఉద్దేశంతో వాళ్ల సహనాన్ని పరీక్షించాననీ, వాళ్ల అహంభావమే వాళ్లని తిరిగి తీసుకెళ్లిపోయిందని అంటాడు. అహంభావం ఎప్పుడూ అనుగ్రహాన్ని సమీపించలేదనీ ... సంపాదించలేదని స్పష్టం చేస్తాడు.