పాపాలను నశింపజేసే పరమేశ్వర క్షేత్రం

భక్తుల కష్టాలను ఆలకించడంలోను ... వాళ్లను ఆపదల నుంచి బయటపడేయడంలోను పరమశివుడు ఎంతమాత్రం ఆలస్యం చేయడు. మనసునిండా భక్తివిశ్వాసాలను కలిగి పిలవాలే గానీ, మరుక్షణంలోనే ఆయన మంచుకొండలు దిగివస్తాడు. అందువల్లనే ఆ స్వామిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధించేవారు ... అనునిత్యం పూజిస్తూ తరించేవాళ్లు ఎంతోమంది వున్నారు.

ఈ కారణంగానే స్వామి ఆలయాలు భక్తజన సందోహంతో అలరారుతున్నాయి. సోమవారాల్లోను ... పర్వదినాల్లోను స్వామివారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ వుంటాయి. అలా భక్తుల మనసుదోచుకున్న మహాదేవుడు మనకి 'దిర్శించర్ల' లో దర్శనమిస్తూ వుంటాడు. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి శివలింగం 'కాశీ' నుంచి తెప్పించి ప్రతిష్ఠించినది కావడం విశేషం.

సదాశివుడు అమ్మవారితో కలిసి కాశీ క్షేత్రంలో ప్రత్యక్షంగా కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు ... మహర్షులు అక్కడి స్వామివారిని అనునిత్యం సేవిస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం నుంచి తెప్పించిన శివలింగం మరింత శక్తిమంతమైనదిగా ... మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు. గంగా పర్వతవర్ధని సమేత రామలింగేశ్వరుడుగా ఇక్కడి స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.

ప్రాచీనకాలానికి చెందిన ఈ క్షేత్రం భక్తుల అపారమైన విశ్వాసానికి ఆనవాలుగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే పాపాలు పటాపంచలైపోతాయని స్థలపురాణం చెబుతోంది. స్వామివారి దర్శనమాత్రంచేతనే దారిద్ర్యము ... దుఃఖము దూరమైపోతాయని అంటారు. స్వామివారిని స్మరించుకున్నంత మాత్రాన్నే ఆపదల నుంచి బయటపడటం జరుగుతుందనీ, ఆయన అనుగ్రహంతో సకలశుభాలు చేకూరతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News