భగవద్గీత పఠన ఫలితం !
భగవద్గీత ఏఇంట్లో అయితే వుంటుందో ఆ ఇల్లు పరమపవిత్రతను సంతరించుకుంటుంది. ఎవరైతే భగవద్గీతను చదువుతూ వుంటారో, వాళ్లు అజ్ఞానాంధకారం నుంచి బయటపడతారు. భగవద్గీత పేరు వినగానే .. యుద్ధరంగంలో మోకాళ్లపై కూర్చుని శ్రీకృష్ణుడికి వినయంగా నమస్కరిస్తోన్న అర్జునుడు, ఆయనకి జ్ఞానోపదేశం చేస్తున్నట్టుగా శ్రీకృష్ణుడు గల దృశ్యం కనులముందు కదలాడుతూ వుంటుంది.
భగవంతుడి ఉనికిని తెలియజేసేదిగా ... సమస్త సంశయాలకు సమాధానంగా భగవద్గీత కనిపిస్తూ వుంటుంది. శకుని చూపిన అధర్మమార్గంలో కౌరవులు ప్రయాణంచేస్తూ వస్తారు. శ్రీకృష్ణుడి సూచనలను అనుసరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లోను తాము ధర్మం తప్పకుండ పాండవులు చూసుకుంటారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు ధర్మయుద్ధానికి దిగుతారు. అయితే శత్రుపక్షంలో గల తనవాళ్లను సంహరించవలసిన పరిస్థితి పట్ల అర్జునుడు ఆవేదన చెందుతాడు. తన పరిస్థితిని శ్రీకృష్ణుడి దగ్గర వ్యక్తం చేసి కర్తవ్యాన్ని బోధించమని కోరతాడు.
ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు ఆయనకి గీతోపదేశం చేసి జ్ఞానమార్గాన్ని సూచించాడు. అలాంటి భగవద్గీత అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త మానవాళికి దారిచూపే ధర్మగ్రంధమై విరాజిల్లుతోంది. ఎంతోమంది భగవద్గీతను పఠిస్తూ తమ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్నారు. మహోన్నతమైన మార్గంలో తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగించారు. అలాంటి భగవద్గీత ప్రతి ఇంట్లోను ఉండాలనీ, దానిని పఠించడం వలన ప్రయోజనం ... పూజించడం వలన పుణ్యం లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
భగవద్గీతను ఎవరైతే పారాయణచేస్తూ ఉంటారో వాళ్లను కలిపురుషుడు సమీపించలేడు. జన్మజన్మలుగా వాళ్లను వెంటాడుతూ వస్తోన్న పాపాలను అది ప్రక్షాళన చేస్తుంది. అనేక దోషాల నుంచి విముక్తులను చేయడమే కాకుండా, యముడి బారినపడకుండా కాపాడుతుంది. అందుకే అంతా భగవద్గీతను ఆశ్రయించాలి ... అది చూపే ధర్మమార్గంలో ప్రయాణించాలని ఎంతోమంది మహనీయులు సెలవిచ్చారు.