దర్శనమాత్రంచే అనుగ్రహించే దయాశంకరుడు

దేవతలు ... మహర్షులు ... మహారాజులు ... మహాభక్తులు .. ఇలా ఎంతోమంది పరమశివుడిని పూజించారు. ఆదిదేవుడిని ఆరాధిస్తూ తరించారు. ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో శివాలయాలు దర్శనమిస్తూ వుంటాయి. కొన్ని క్షేత్రాలు వైభవంతో వెలుగొందుతూ వుంటే, మరికొన్ని క్షేత్రాలు మారుమూల గ్రామాల్లో వున్న కారణంగా సరైన ఆదరణకి నోచుకోలేకపోతున్నాయి.

అలా ఎంతో ప్రాచీనతను కలిగినదే అయినప్పటికీ, తగినంత ప్రాచుర్యంలేనిదిగా 'ఆళ్లగడప'లోని శివాలయం కనిపిస్తుంది. ఇది నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలోకి వస్తుంది. ప్రాచీనకాలం నాటి ఇక్కడి శివలింగం దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతూ వుంటుంది. ఈ శివలింగం .. ఇక్కడికి సమీపంలో గల 'సోమవారం' క్షేత్రంలోని శివలింగాన్ని పోలివుంటుందని చెబుతుంటారు.

సోమవరం ... భ్రుగుమహర్షి తపస్సు చేసుకుని శివుడి సాక్షాత్కారాన్ని పొందిన పుణ్యక్షేత్రం. అందుకే ఇక్కడి స్వామివారిని 'భ్రుగుమాలికా సోమేశ్వరస్వామి' గా కొలుస్తుంటారు. ఆళ్లగడపలోని శివలింగం కూడా అదే శివలింగాన్ని పోలివుండటం విశేషం. అంతేకాకుండా ఇక్కడి శివలింగం ప్రస్తావన, సోమవరం క్షేత్రంలోని శాసనంలో కనిపిస్తుందని అంటారు. అందువలన ఈ క్షేత్రం కూడా ప్రాచీనమైనదని చెబుతుంటారు. అయితే స్థలమహాత్మ్యాన్ని తెలిపే పూర్తి ఆధారాలు లభించకపోవడం భక్తులకు కొంత అసంతృప్తిని కలిగిస్తూ వుంటుంది.

దాదాపు రెండువందల సంవత్సరాల క్రితం ఇక్కడ శివలింగం వెలుగు చూసిన దగ్గర నుంచి భక్తులు దర్శించుకుంటూ వున్నారు. స్వామివారు దర్శన మాత్రంచేత అనుగ్రహించే దయాసాగరుడని అంటారు. ఆయనని ఆరాధిస్తే సకలశుభాలు చేకూరతాయని చెబుతుంటారు. ప్రాచీనకాలంనాటి ఈ శివాలయానికి ప్రాచుర్యాన్ని కల్పించి, పూర్వవైభవాన్ని తీసుకురావలసిన అవసరం కనిపిస్తుంది.


More Bhakti News