ఆలయ దర్శనఫలితం ఇలా దక్కుతుంది !

ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అందువలన అక్కడ దైవం ప్రత్యక్షంగా కొలువై ఉన్నట్టుగా భావిస్తుంటారు. పూజామందిరంలో దీపారాధన చేసుకున్నా, ఆలయదర్శనం వలన కలిగే అనుభూతి వేరు ... అది అందించే పుణ్యఫలితం వేరు. అందుకే కొంతమంది అనునిత్యం ఆలయాలకి వెళుతూ వుంటారు ... మరికొందరు విశేషమైన రోజుల్లోనూ ... పర్వదినాల్లోను ఆలయాలను దర్శించుకుంటూ వుంటారు.

ఇక ఆలయప్రాంగణంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మనసు భగవంతుడి గురించిన ఆలోచన మాత్రమే చేస్తూ వుండాలి. ఇతర ఆలోచనలను దరిదాపుల్లోకి రానీయకూడదు. తన కుటుంబాన్ని సదా కాపాడుతూ వస్తోన్న భగవంతుడిపట్ల మనసంతా కృతజ్ఞతా భావాన్ని నింపుకుని ప్రదక్షిణలు చేయాలి. సాధ్యమైనంత త్వరగా ముగించేద్దామన్నట్టుగా గబగబా అడుగులు వేయకుండా ప్రశాంతంగా ప్రదక్షిణలు పూర్తిచేయాలి.

దైవదర్శనానికి వెళుతూ ఇతరులను అసహ్యించుకోవడంగానీ .. వాళ్లపై కోప్పడటంగాని .. పెద్దగా అరవడం గాని చేయకూడదు. ఇతరుల ఎదుట గొప్పకోసం కాకుండా అణకువగా కానుకలు సమర్పించాలి. ఇక ప్రసాదం రుచిని గురించిన విమర్శ చేయకుండా భక్తితో స్వీకరించాలి. ఆలయ అభివృద్ధిలో పాలుపంచుకోవడం కోసం తనకి తోచినంత సాయాన్ని సమర్పించాలి. పరివార దేవతలకు ... ప్రధాన దైవానికి ఎదురుగాగల వాహన దేవతలకు నమస్కరించుకోవాలి.

ఆలయ ప్రాంగణంలో కాసేపు కూర్చుని భగవంతుడి లీలలను ... తమని ఆయన ఆదుకున్న సంఘటనలను తలచుకుని మనసులో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆలయంలో గంటధ్వని .. అర్చకుల మంత్రాలు ... భక్తుల భజనలు .. ఇలా అన్నింటినీ ఆస్వాదించాలి. సాధారణంగా ఆలయానికి వచ్చే భక్తులను నమ్ముకునే కొంతమంది నిస్సహాయులు అక్కడ వుంటారు. సమయానికి డబ్బులు దగ్గర వుంటే దానంగా తోచినంత ఇవ్వాలి .. లేదంటే ఆ విషయాన్ని సున్నితంగా చెప్పాలేగాని విసుక్కోకూడదు. ఏ ప్రశాంతతను ఆశించి దేవాలయానికి వెళతామో, ఆ ప్రశాంతతను పొంది తిరిగి వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే ఆలయ దర్శనఫలితం పరిపూర్ణంగా లభిస్తుంది.


More Bhakti News