మాఘపౌర్ణమిన రధోత్సవ దర్శనఫలితం
మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా కొన్ని క్షేత్రాల్లో ... మాఘశుద్ధ పౌర్ణమి రోజున మరికొన్ని క్షేత్రాల్లో నరసింహస్వామి కల్యాణోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతూ వుంటాయి. ఈ సందర్భంగా నరసింహస్వామి ఆవిర్భవించిన ఆయా క్షేత్రాలు భక్తజన సందోహంతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. అలా ఈ మాసంలో కల్యాణోత్సవ శోభను సంతరించుకునే క్షేత్రాల్లో 'ఘనపురం' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది.
ఈ గ్రామం మెదక్ జిల్లా పరిధిలోకి వస్తుంది. నరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో ఘనపురం ఒకటిగా ప్రసిద్ధిచెందింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీసమేతంగా వెలుగుచూశాడు. అప్పటి నుంచి ఆ స్వామి చూపుతోన్న మహిమలు అన్నీఇన్నీకావు. ప్రతి సంవత్సరం ఇక్కడి స్వామివారికి మాఘమాసంలో అయిదు రోజులపాటు కల్యాణోత్సవం జరుగుతూ వుంటుంది.
ఈ నేపథ్యంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి వైభవంగా 'రథోత్సవం' జరుపుతారు. రథంపై ఊరేగుతూ వస్తోన్న స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్షేత్రం మహిమాన్వితమైనదనీ, స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు బలంగా విశ్వసిస్తుంటారు. అందువలన అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయన ఉత్సవాల్లో పాల్గొంటూ వుంటారు.
రథంపై ఊరేగుతోన్న స్వామివారినీ ... అమ్మవారిని దర్శించుకోవడం వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయని భావిస్తుంటారు. ఆ సమయంలో స్వామివారికి చెప్పుకున్న కోరికలు అనతికాలంలోనే నెరవేరతాయని అంటారు. దారిద్ర్యము ... దుఃఖం నశించి సకలసంపదలు కలుగుతాయనీ, శుభాలు చేకూరతాయని చెబుతుంటారు.