దైవాన్ని సమీపించడానికి అర్హత ఇదే !
భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడు ? ... తన సన్నిధిలో అడుగుపెట్టే అర్హతను ఎవరికి ప్రసాదిస్తాడు ? అంటే ... మానవత్వమున్నవారిని మాత్రమే అనే సమాధానం ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ... మరెంతోమంది మహా భక్తులు మానవత్వాన్ని ఆవిష్కరించారు. మానవత్వమనేది మనిషిలో దాగిన అదనపు శక్తి కాదనీ, అది మనిషి ప్రాధమిక హక్కని చాటిచెప్పారు.
కుష్ఠువ్యాధితో బాధపడుతోన్న ఒకవ్యక్తిని అంతా వెలేసినట్టుగా చూస్తూ వుంటే, ఆ వ్యక్తిని ఆప్యాయంగా స్పర్శించి అతనికి ఆ వ్యాధి నుంచి విముక్తిని కల్పించాడు ఆదిశంకరాచార్యులు. శిరిడీ సాయిబాబా కూడా కుష్ఠువ్యాధిగ్రస్తుడికి సేవలు చేసి మానవత్వానికి మచ్చుతునకగా నిలిచాడు. తానెంతో అవసరాల్లో ఉన్నప్పటికీ, తన దగ్గరున్న డబ్బుతో ఒక వ్యక్తిని రుణవిముక్తుడిని చేస్తాడు తుకారామ్. రాజదండన అనుభవిస్తోన్న ఆ వ్యక్తిని మానవత్వంతో ఆదుకుంటాడు.
భగవంతుడి కృపకు అందరూ పాత్రులేనంటూ, ఆ కాలంలో హీనులుగా ... దీనులుగా చెప్పబడుతోన్నవారికి ఆలయ ప్రవేశం కలిగేందుకు కృషిచేశాడు పురందరదాసు. ఇక అన్నమయ్య రచించిన కొన్ని కీర్తనలలోను ఇదే ఉద్దేశం కనబడుతుంది. ఇక ఊళ్లోవాళ్లంతా ఒక వ్యక్తిని అసహ్యించుకుని అతనిని దూరంగా ఉంచితే, ఆ వ్యక్తిని తన సన్నిధిలోకి అనుమతిస్తాడు రాఘవేంద్రస్వామి. ఆ వ్యక్తి అభ్యర్థన మేరకు అతనికి ఉత్తమగతులను కూడా కల్పిస్తాడు.
ఇతరుల ఆకలితీర్చడంలోని ఆనందం, ఎన్నిమార్లు విందుభోజనం చేసినా దక్కదని చెప్పిన మహానుభావుడు కబీరుదాసు. ఎంతటి పేదరికాన్ని అనుభవిస్తూవున్నా ఆయన ఇతరులకి ఆతిథ్యం ఇవ్వడం మాత్రం మానలేదు. ఇలా ఎంతోమంది మహానుభావులు మానవత్వాన్ని బతికిస్తూ వచ్చారు. మానవత్వం కలిగినవారికి మాత్రమే భగవంతుడు తన దర్శనానికి ద్వారాలు తెరుస్తాడని చాటిచెప్పారు.