గాయత్రీ మంత్ర జప ఫలితం !
గాయత్రీమంత్రం ఈ విశ్వానికి లభించిన విలువైన వరం. ఎంతోమంది మహర్షులు గాయత్రీ జపాన్ని ఆచరించి ధన్యులయ్యారు. మరెంతోమంది గాయత్రీ జపం ద్వారా ఆ తల్లి దర్శనభాగ్యాన్ని పొందారు. ఆమె కరుణాకటాక్ష వీక్షణాలలో తరించారు. ఇప్పటికీ అనునిత్యం గాయత్రీ జపం చేసుకునేవాళ్లు ఎంతోమంది వున్నారు. వాళ్లంతా నియమం తప్పకుండా నిష్టతో గాయత్రీ చేసుకుంటూ వుంటారు.
గాయత్రీ అంటేనే రక్షించునది అనే అర్థం చెప్పబడుతోంది. ఎవరైతే నిత్యం గాయత్రీ జపం చేసుకుంటూ వుంటారో, వాళ్లని అది ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వుంటుంది. అనుక్షణం అది నీడలా అనుసరిస్తూ రక్షిస్తూ వుంటుంది. సమస్త పాపాల నుంచి ... దోషాల నుంచి విముక్తులను చేస్తుంటుంది. అందువల్లనే చాలామంది క్రమంతప్పకుండా గాయత్రీ జపం చేసుకుంటూ వుంటారు.
గాయత్రీ జపానికిగల ప్రభావం అంతాఇంతా కాదు. జీవితం అనేక కష్టనష్టాలకి గురవుతూ వుంటుంది. ఆర్ధికపరమైన చిక్కులు ... ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అనుకోని ఆపదలు చుట్టుముడుతుంటాయి. దుష్టశక్తులు మానసికపరమైన ఆందోళనను కలిగిస్తూ వుంటాయి. ఇక అనుకున్న పనులు ఆరంభంలోనే ఆగిపోతూ తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తూ వుంటాయి. ఆశించిన పనులు నిరాశపరుస్తూ వుంటాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి గాయత్రీ మంత్ర జపానికి మించిన మార్గం లేదు.
గాయత్రీ మంత్ర జపాన్ని అనునిత్యం ఆచరిస్తోన్నవారిని ఈ సమస్యలేవీ కూడా దరిచేరలేవు. గాయత్రీ మంత్రం జపిస్తూ ఉండటం వలన ఆపదలు నివారించబడతాయి ... ఆశించిన విజయాలు చేకూరతాయి. జీవితం సంతోషకరంగా సాగిపోవడానికి అవసరమైన శుభాలు సమకూరతాయి. అందువలన అనునిత్యం నియమనిష్టలను ఆచరిస్తూ గాయత్రీ మంత్ర జపం చేయడం మరచిపోకూడదు.