తల్లిదండ్రుల సేవాభాగ్యం అలాంటిది !
అజ్ఞానాన్ని అంటిపెట్టుకునే అహంకారం వుంటుంది. అలాంటివాళ్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వుంటారు. ఎవరెన్ని విధాలుగా మంచిచెప్పినా అవి వాళ్ల చెవికెక్కవు. అలాంటివాళ్లు పరమపవిత్రమైన ప్రదేశాల్లో అడుగుపెట్టినప్పుడు సహజంగానే వాళ్లలో మార్పు వస్తూ వుంటుంది. ఇక అక్కడి మహనీయుల దర్శనభాగ్యం వలన వాళ్లు పూర్తిగా మారిపోతుంటారు. అందుకు పుండరీకుడి కథ నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తూ వుంటుంది.
ఒకసారి పుండరీకుడు 'కుక్కుట మహర్షి' ఆశ్రమం సమీపంలోకి వెళతాడు. కళా విహీనంగా వున్న ముగ్గురు స్త్రీలు ఆయన ఆశ్రమ పరిసరాలను శుభ్రపరచడం ... లోపలికి వెళ్లినవాళ్లు దివ్యమైనటువంటి వర్చస్సుతో బయటికిరావడం చూసి ఆశ్చర్యపోతాడు. వాళ్లకి ఎదురుగా వెళ్లి ఆ విశేషాన్ని గురించి ఆసక్తిగా అడుగుతాడు. తమ పేర్లు గంగ .. యమున .. సరస్వతియని వాళ్లు చెబుతారు. ఇతరుల పాపాలని ప్రక్షాళన చేస్తూ ఉండటం వలన, తాము అలా కళావిహీనమై పోతుంటామని అంటారు. తాము స్వీకరించిన పాపాల నుంచి విముక్తిని పొందడానికి కుక్కుట మహర్షిని సేవిస్తూ ఉంటామని చెబుతారు.
ఆయనకి అంతటి శక్తిసామర్థ్యాలు ఎక్కడివని పుండరీకుడు అడుగుతాడు. ఆయన అనునిత్యం తల్లిదండ్రులను సేవిస్తూ ఉండటమే అందుకు కారణమని వాళ్లు చెబుతారు. తాము మాత్రమే కాదనీ, ఎంతోమంది దేవతలు కుక్కుట మహర్షిని దర్శించుకుని వెళుతూ ఉంటారని అంటారు. ఆ సమయంలోనే అతనికి కుక్కుట మహర్షి దర్శనం కూడా లభిస్తుంది. ఆయన దర్శనభాగ్యంతో పుండరీకుడికి జ్ఞానోదయమవుతుంది.
తల్లిదండ్రులను సేవించేవారిని దేవతలు సైతం సేవిస్తారనే విషయం పుండరీకుడికి అర్థమవుతుంది. తాను తన తల్లిదండ్రులను ఎన్ని విధాలుగా బాధించినది గుర్తుకు వస్తుంది. ఇక వాళ్లకి సేవలు చేస్తూ తన పాపాలను కడిగివేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. అలా మహనీయులు తిరుగాడే ప్రదేశంలో అడుగుపెట్టడం వలన ... వాళ్ల దర్శనభాగ్యం లభించడం వలన అజ్ఞానాంధకారంలో నుంచి బయటపడే అవకాశం కలుగుతూ వుంటుంది.