మంచితనమే మార్గాన్ని చూపుతుంది
మంచికిపోతే చెడు ఎదురైందనే మాట కొన్ని సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. అలా అని చెప్పేసి మంచిపనులకు దూరంగా ఎప్పుడూ వుండకూడదు. మంచితనం ఎవరి గుర్తింపును ఆశించదు. ఒకరో ఇద్దరో మంచితనాన్ని అర్థంచేసుకోలేకపోయినా దానివలన వచ్చే నష్టంలేదు. అందువలన మంచితనాన్ని వదలిపెట్టకూడదు. అవసరం ... అవకాశం లభించిన ప్రతిసారి మానవత్వాన్ని ఆవిష్కరిస్తూనే వుండాలి .. అవతలవారిని ఆదుకుంటూనే వుండాలి.
ఇక భగవంతుడు ప్రతి పనికి ఫలితాన్ని ముట్టచెబుతూనే ఉంటాడు కాబట్టి, మంచితనంతో చేసిన పనులకు తగిన ప్రతిఫలం అందుతూనే వుంటుంది. ఎంతోమంది మహానుభావుల జీవితంలోని కొన్ని సంఘటనలు ఇందుకు ఉదాహరణగా కనిపిస్తూ వుంటాయి. పాండురంగడి భక్తుడైన తుకారామ్ రేపటి రోజుకంటూ ఎప్పుడూ ఏదీ దాచుకునేవాడు కాదు. తన సంపదలను నిస్సహాయులైనవారి కోసం ఆయన ఖర్చుచేసేవాడు.
అలాంటి తుకారామ్ కి ఒకానొక పరిస్థితిలో ఉండటానికి ఇల్లు కూడా లేకుండా పోతుంది. దాంతో ఆయన భార్యా పిల్లలతో కలసి కట్టుబట్టలతో బయటికి వచ్చేస్తాడు. అయితే అప్పటివరకూ ఆయన చూపిన మంచితనం ఆయనని ఆ సమయంలో ఆదుకుంటుంది. ఆయన ద్వారా సహాయాన్ని పొందిన వాళ్లంతా కలిసి ఆయన కుటుంబాన్ని ఆదరిస్తారు. ఎలాంటి లోటు లేకుండా వాళ్లు ఉండటానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.
చెడు చూపే ప్రభావం గాలివాటుకి కొట్టుకుపోతుందనీ, మంచితనం వలన లభించే ఫలితాన్ని మాత్రం ఎన్ని తుఫానులైనా అడ్డుకోలేవని తుకారామ్ అంటాడు. తనలోని మంచిని మేల్కొలిపి పదిమందిలోని మంచిని మేల్కొలిపేలా చేసింది ఆ పాండురంగడేనంటూ మనసులోనే ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. సూర్యుడు వెలుగును ప్రసాదిస్తాడనేది ఎంత నిజమో, మంచితనం మార్గాన్ని చూపిస్తుందనేది అంతనిజమని అంటాడు.