గండాలను తొలగించే వేంకటేశ్వరుడు

జీవితమన్నాక ఆనందాలు ... విషాదాలు పలకరిస్తూనే వుంటాయి. ఏ సమస్యా లేనంత వరకూ అంతా సాఫీగా గడచిపోతూ వుంటుంది. ఇక అనుకోకుండా ఏ ఆపద కలిగినా దానిని మానసికంగా ఎదుర్కోవడం అంతతేలికైన విషయం కాదు. అలా అనుకోని గండాలు ఎదురైనప్పుడు అందరికీ గుర్తుకువచ్చే దేవుడు ఆ వేంకటేశ్వరుడే. ఆయన అందరికీ దగ్గరవాడు .. అపారమైన భక్తివిశ్వాసాలను అందుకున్నవాడు. అందుకే ఆపద మొక్కులవాడిగా భక్తులు ఆయనని కొనియాడుతుంటారు.

అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకునే వేంకటేశ్వరుడు 'రేపాల' లో దర్శనమిస్తున్నాడు. నల్గొండ జిల్లా మునగాల మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఆలయం వేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది. ప్రాచీనకాలం నుంచి స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. స్వామివారి మహిమలు ఇక్కడ కథలు కథలుగా వినిపిస్తూ వుంటాయి.

శ్రీదేవి - భూదేవి సమేతంగా స్వామివారు ఈ క్షేత్రంలో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ప్రతి శనివారంతో పాటు పర్వదినాల్లో స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా మనసులో ఇక్కడి స్వామివారికి మొక్కుకుంటేచాలు, ఆ గండం నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

ఎవరిని ఏ విషయంగా దుఃఖం వెంటాడుతూ వున్నా, స్వామి దర్శనభాగ్యంతో అది దూరమైపోతుందని అంటారు. తమను కాపాడుతూ వస్తోన్న స్వామివారిని మరింత వైభవంగా చూసుకోవడానికి భక్తులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అంగరంగవైభవంగా ఆయనకి ఉత్సవాలు జరిపిస్తూ తరిస్తుంటారు.


More Bhakti News