పంచముఖి రుద్రాక్ష ప్రభావం
పరమశివుడి కంటి నుంచి నేలరాలిన నీటి బిందువులు 'రుద్రాక్షలు' గా చెప్పబడుతున్నాయి. ఇవి అత్యంత శక్తిమంతమైనవి ... మహా మహిమాన్వితమైనవనే విశ్వాసం పురాణకాలం నుంచే వుంది. అందువలన అప్పట్లో ఆశ్రమజీవితం గడిపేవారు ... అంతఃపురజీవితం గడిపేవారు ... సాధారణ ప్రజానీకం కూడా రుద్రాక్షలు ధరిస్తూ వచ్చారు. ఇప్పటికీ రుద్రాక్షలకి ఆదరణ కనిపిస్తుంది.
రుద్రాక్షలు వివిధ ముఖాలు కలిగినవిగా చెబుతుంటారు. ఏకముఖి .. ద్విముఖి .. ఇలా వీటి ముఖాల సంఖ్య పెరుగుతూ పోతుంటుంది. ఒక్కో రకం రుద్రాక్షను ధరించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలోనే 'పంచముఖి' రుద్రాక్ష తనదైన ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. సాధారణంగా కొన్నిరకాల రుద్రాక్షలు అరుదుగా మాత్రమే లభిస్తూ వుంటాయి. పంచముఖి రుద్రాక్ష మాత్రం చాలా తేలికగానే లభిస్తూ వుంటుంది.
'కాలాగ్ని స్వరూపిణి' గా చెప్పబడుతోన్న ఈ రుద్రాక్షను ధరించడం వలన అనేక రకాల ప్రయోజనాలు వున్నాయి. పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన అనేక దోషాలు ... పాపాలు నివారించబడతాయి. మానసికపరమైన ఆందోళనను దూరం చేయడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శత్రుభయాలు ... విషబాధలు లేకుండా చేస్తుంది. రక్తపోటును నియంత్రించి గుండెజబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.
ఇక ఈ రుద్రాక్షను ధరించడం వలన అదృష్టం సొంతమవుతుందని చెప్పబడుతోంది. ఇలా పంచముఖి రుద్రాక్ష అటు ఆధ్యాత్మిక పరంగాను ... ఇటు ఆరోగ్య పరంగాను జీవితాన్ని ప్రభావితం చేస్తూ, అనుకున్న దిశలో అభివృద్ధి సాధించడానికి ఎంతగానో తోడ్పడుతోంది.