శంఖానికి గల ప్రత్యేకత అదే !
శ్రీమహావిష్ణువు శంఖుచక్రాలను ధరించి దర్శనమిస్తూ వుంటాడు. ఆయన చేతిలో కనిపించే 'దక్షిణావృత శంఖం' సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది. లక్ష్మీదేవి సముద్రుడి కూతురు ... శంఖాలు సముద్రంలోనే లభిస్తుంటాయి. అందువలన శంఖం లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతుంటారు. ఈ శంఖాన్ని పూజించడం వలన సకలశుభాలు చేకూరతాయి. దీనిలో పోసిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన సమస్తరోగాలు నశిస్తాయి. ఇంతటి విశిష్టతను కలిగిన శంఖం ఆలయాల్లోనూ ... పూజమందిరాల్లోను కనిపిస్తూ వుంటుంది.
ఒకప్పుడు శంఖం మరింత ఎక్కువగా వాడుకలో ఉందనడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో సాధువులు మాత్రమేకాదు ... రాజులు సైతం శంఖాన్ని కలిగి వుండేవాళ్లు. వారి దగ్గరగల ఉత్తమమైన శంఖాలు విశిష్టమైనటువంటి పేరును కలిగి ఉండేవి. వాటికి వాళ్లు ఎంతో ప్రాధాన్యతనిచ్చి, ప్రత్యేకమైన నగిషీలు చేయించి ఆకర్షణీయంగా ఉండేలా చూసుకునేవారు.
శంఖాన్ని పూరించడమనేది ఇప్పుడు దైవకార్యాల్లోను ... కొన్ని చోట్ల శుభకార్యాలలోను కనిపిస్తూ వుంటుంది. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా యుద్ధ సమయాల్లోనూ శంఖాన్ని పూరించినట్టు స్పష్టమవుతోంది. యుద్ధానికి సమయం ఆసన్నమైందని చెప్పడానికీ ... విజయం తమదేననే సంకేతాన్ని ఇవ్వడానికి శంఖాన్ని పూరించేవారు. ఈ నేపథ్యంలో మహాభారత యుద్ధసమయంలో శ్రీకృష్ణుడు 'పాంచజన్యం' అనే శంఖాన్ని పూరించాడు.
ఇక ధర్మరాజు 'అనంతవిజయము' ... భీముడు 'పౌండ్రకము' ... అర్జునుడు 'దేవదత్తం' ... నకులుడు 'సుఘోషము' ... సహదేవుడు 'మణి పుష్పకము' అనే శంఖాలను పూరించినట్టు చెప్పబడుతోంది. అలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా, వీరత్వానికీ ... విజయానికి సంకేతంగా యుద్ధసమయంలోను శంఖాన్ని ఉపయోగించడం జరిగింది.