శిరిడీసాయి కరుణా కిరణాలు
సూర్యభగవానుడి నుంచి వెలువడే కిరణాలు లోకంలోని అన్నిప్రాంతాలకు ... ప్రదేశాలకు వెలుగును ప్రసరింపజేస్తూ వుంటాయి. అలాగే తన కరుణాకిరణాలను అన్నివైపులకు శిరిడీ సాయినాథుడు ప్రసరింపజేస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకు అనేక సంఘటనలను నిదర్శనంగా చూపుతుంటారు.
బాబా ఓ సాధారణ ఫకీరులా మశీదులో ఉన్నప్పటికీ ఆయన చూపిన మహిమలు అన్నీ ఇన్నీ కావు. వివిధ ప్రాంతాలలో వున్న భక్తులకు ఆయన అనుగ్రహం అన్ని సమయాల్లోనూ అందుతూ వుండేది. ఎక్కడ ఏం జరుగుతుందనేది ఆయనకి ముందుగానే తెలిసిపోతూ వుండేది. తనని విశ్వసించిన భక్తులు ఎంతదూరంలో వున్నా ... ఎలాంటి ఆపదలో వున్నా ఆయన కాపాడటం వలన ఈ విషయం అందరి అనుభవంలోకి వచ్చింది.
ఎక్కడో మారుమూల గ్రామంలో 'మైనాతాయి' ప్రసవవేదన పడుతుంటే, తనచేతి విభూతి ఆమెకి అందేలాచేసి సుఖప్రసవం జరిగేలా చూస్తాడు. మరెక్కడో సముద్రంలో నౌకతోపాటు తన భక్తుడు కూడా మునిగిపోతూ వుండటం బాబాకి తెలియడం, మశీదులో నుంచి కదలకుండానే ఆ భక్తుడిని బాబా రక్షించడం ఆయన దైవస్వరూపమనే విషయాన్ని చెప్పకనే చెబుతుంటుంది. ఇక ప్రమాదాల బారిన పడబోతోన్న వాళ్లనీ .. అనారోగ్యాల బారిన పడబోతోన్న వాళ్లను ముందుగానే హెచ్చరించిన తీరుచూస్తే, బాబాకి తెలియకుండా ఏదీ జరగదనే విషయం స్పష్టమవుతూ వుంటుంది.
తనని నమ్మిన భక్తులు ప్రయాణాలు చేస్తునప్పుడు వాళ్లు విషకీటకాల బారిన పడకుండా, మార్గమధ్యంలో ఎలాంటి చిక్కుల్లో పడకుండా బాబా చూపిన లీలలు ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. ఇలా తనని విశ్వసించినవారిని ఆయన నీడలా వెన్నంటి వుంటూ అనుక్షణం కాపాడుతూ ఉంటాడనడానికి ఎన్నో ఉదాహరణలు వినిపిస్తూ వుంటాయి. మరెన్నో నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి.