ఈ రోజున నువ్వులను ఉపయోగించాలి

మాఘమాసంలో ఆహారపదార్థాలలో నువ్వుల వాడకం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్పబడుతోంది. ఈ మాసంలో చలి ఎక్కువగా వుంటుంది కనుక, దానిని తట్టుకునే శక్తిని అందించే నువ్వులను ఎక్కువగా ఉపయోగించాలని అంటారు. ముఖ్యంగా మాఘశుద్ధ ద్వాదశి రోజున నువ్వుల వాడకానికి మరింత ప్రాధాన్యత ఇవ్వబడింది. అందుకే దీనిని 'తిల ద్వాదశి' అని పిలుస్తుంటారు.

ఈరోజున శ్రీమహావిష్ణువును పూజించడం వలన సమస్తదోషాలు నశించి, సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది. ఆధ్యాత్మికపరంగా ఈరోజున జరుపుకునే వ్రతంలో భాగంగా నువ్వుల వాడకం కనిపిస్తుంది. ఈరోజున ఉదయాన్నే స్నానం చేయడానికి ముందు ఆ నీళ్లలో నువ్వులు వేయాలి. అలా నువ్వులు వేయబడిన నీటితో స్నానం చేయాలి. పూజామందిరంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.

భగవంతుడికి నువ్వులతో చేయబడిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. తీసుకునే ఆహారంలోను నువ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇక ఈరోజున నువ్వులను దానంగా ఇవ్వవలసి వుంటుంది. సాధారణంగా ఈ మాసంలో వుండే వాతావరణం కొన్నిరకాల అనారోగ్యాలను కలిగిస్తూ వుంటుంది. అలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా వుండటం కోసం ఇలా నువ్వుల వాడకం చెప్పబడుతోంది. అందువలన తిల ద్వాదశి రోజున ఈ నియమాల ప్రకారం నువ్వులు వాడటం మరచిపోకూడదు.


More Bhakti News