భక్తుడి కోసం శాపాన్ని స్వీకరించిన భగవంతుడు
శ్రీమహావిష్ణువుకి మహాభక్తుడైన 'అంబరీషుడు' ద్వాదశీ వ్రతం చేస్తూ వుండగా దూర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. అకారణంగా అంబరీషుడిని అవమానపరచి, వివిధ జన్మల్లో వివిధ జీవులుగా జన్మించమని శపిస్తాడు. జరిగినదానికి అంబరీషుడు ఎంతగానో బాధపడతాడు. తన భక్తుడు అంతగా బాధపడుతూ ఉండటాన్ని సహించలేకపోయిన శ్రీమహావిష్ణువు, తన సుదర్శన చక్రాన్ని దూర్వాసుడిపై ప్రయోగిస్తాడు.
ప్రాణభయంతో ఆయన ముల్లోకాలకు పరుగులు తీస్తాడు. తాను శపించిన అంబరీషుడు తప్ప తనని ఎవరూ కాపాడలేరని తెలుసుకుని తిరిగివచ్చి ఆయననే శరణు వేడతాడు. సహనానికీ .. శాంతానికి ప్రతిరూపమైన అంబరీషుడు, సుదర్శన చక్రాన్ని ప్రార్ధించి, దాని బారి నుంచి దూర్వాస మహర్షిని కాపాడతాడు. ఆయన కారణంగా తనకి సుదర్శన చక్రాన్ని దర్శించే మహద్భాగ్యం కలిగిందని అంబరీషుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆయన ఎంత గొప్ప మనసున్న వాడనే విషయం ఆ ఒక్కమాటతో దూర్వాస మహర్షికి అర్థమైపోతుంది.
ఇక అంబరీషుడికి దూర్వాసుడు ఇచ్చిన శాపాన్ని విష్ణుమూర్తి స్వీకరిస్తాడు. శరణుకోరిన దూర్వాసుడిని రక్షించిన భక్తుడిగా అంబరీషుడి కీర్తిప్రతిష్ఠలు శాశ్వతంగా నిలిచిపోయాయి. సహనము ... శాంతము సహజమైన ఆభరణాలుగా గల వారికి భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భం తెలియజేస్తోంది. భక్తులు సమర్పించే నైవేద్యాలు కానుకలు అందుకోవడమే కాదు, వాళ్లు సంతోషంగా వుండటం కోసం శాపాలను సైతం స్వీకరించడానికి కూడా భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడనే విషయాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తూ వుంటుంది.