అదంతా శ్రీనివాసుడి లీలావిశేషమే !

తనతో పద్మావతీదేవి వివాహానికి ఆకాశరాజు దంపతులను ఒప్పించి రమ్మని చెప్పి శ్రీనివాసుడు వకుళమాతను పంపిస్తాడు. ఆమె అక్కడికి చేరుకునేలోగా, ఎరుకల 'సింగి' రూపంలో ఆకాశరాజు అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. మనసుపడిన వ్యక్తికే ఇచ్చి పద్మావతీదేవి వివాహాన్ని జరిపించడం అన్నివిధాలా మంచిదని చెబుతాడు. ఆ తరువాత తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఎరుకల 'సింగి' మాటలు ఆకాశరాజు దంపతుల నిర్ణయాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి.

అదే సమయంలో 'వకుళమాత' వచ్చి తన మనసులో మాటను చెబుతుంది. ఆమె అభ్యర్థనమేరకు వాళ్లు శ్రీనివాసుడితో పద్మావతీదేవి వివాహాన్ని జరిపించడానికి అంగీకరిస్తారు. లగ్న పత్రికను కూడా రాసి పంపిస్తారు. ఆకాశరాజు అంతఃపురం నుంచి తిరిగి వస్తోన్న వకుళమాతని దూరం నుంచే చూసిన శ్రీనివాసుడు, ఆతృతగా ఆమెకి ఎదురు వెళతాడు. ఏమీ తెలియనివాడి మాదిరిగా ..వెళ్లినపని ఏవైందంటూ ఆమెని తొందరచేస్తాడు.

శ్రీనివాసుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడేననే విషయాన్ని అంతకుముందే తెలుసుకున్న వకుళమాత, ఆయన కన్నుల్లోకి సూటిగా చూస్తుంది. జగాలనేలే జగన్నాథుడి సంకల్పానికి ఆటంకాలు ... అవరోధాలు ఎందుకు ఉంటాయంటూ బాలగోపాలుడిలానే ప్రేమతో ఆయనని దగ్గరికి తీసుకుంటుంది. వకుళమాతకు విషయం తెలిసిపోయిందని గ్రహించిన శ్రీనివాసుడు కూడా ఆప్యాయంగా ఆమె అక్కున చేరిపోతాడు. ఇలా ఆ శ్రీమన్నారాయణుడు .. శ్రీనివాసుడిగా చూపిన లీలవిశేషాలు అన్నీ ఇన్నీ కావు. ఆ విశేషాలు ఆనందానుభూతులను అందిస్తుంటాయి. తలచుకున్నవాళ్లందరినీ తరింపజేస్తుంటాయి.


More Bhakti News