ఆపదలను నివారించే దుర్గా నామం !

దుర్గాదేవి నామం వినిపించేంత దూరంలో ... దుర్గాదేవి రూపం కనిపించేంత దూరంలో లేకుండా దుష్టశక్తులు పారిపోతుంటాయి. లోకకల్యాణం కోసం త్రిమూర్తులు సైతం అమ్మవారి సాయాన్ని అర్ధించారంటే ఆ తల్లి ఎంతటి శక్తిస్వరూపిణియో అర్థంచేసుకోవచ్చు. అలాంటి ఆదిపరాశక్తియే ... దుర్గాదేవిగా అవతరించింది. సాధుసజ్జనులను పీడిస్తోన్న అసురులను సంహరిస్తూ ... తన బిడ్డలను కాపాడుకుంటూ వస్తోంది.

అమ్మవారు ధరించిన దుర్గాదేవి రూపం భక్తుల హృదయాలను ఆకట్టుకుంటుంది. అత్యంత శక్తిమంతమైన ఆ తల్లి నామం వెంటనే మనసును పట్టుకుంటుంది. అందుకే భక్తులు దుర్గాదేవికి మరింత దగ్గరయ్యారు. దుష్టులపై నిప్పులు కురిపించే అమ్మవారి చూపులు ... భక్తుల దోసిళ్లలో వరాల జల్లును కురిపిస్తుంటాయి. అమ్మవారి అనుగ్రహంతోనే వివాహయోగం కలుగుతుందనీ, సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

దుర్గా అనే నామం రెండే అక్షరాలూ అయినప్పటికీ, ఆ నామానికిగల శక్తి అంతా ఇంతా కాదు. సమస్త లోకాలను ఈ రెండు అక్షరాలే రక్షించగలవు. సర్వమంగళాలను ఈ రెండు అక్షరాలే ప్రసాదించగలవు. అందుకే దుర్గా నామం మహిమాన్వితమైనదిగా ... మహా శక్తిమంతమైనదిగా చెప్పబడుతోంది. అనునిత్యం అమ్మవారి నామాన్ని స్మరిస్తూ వుండటం వలన, ఆ నామ ప్రభావం రక్షణ వలయంగా ఏర్పడి ఆపదల నుంచి అనుక్షణం కాపాడుతూ ఉంటుంది.

దుర్గా అంటేనే దుర్గతులను పారద్రోలేదని అర్థం. అమ్మవారి నామస్మరణ వలన దారిద్ర్యం ... దుఃఖం తరిమివేయబడతాయి. అనారోగ్యాలు ... భయాందోళనలు దూరమవుతాయి. ఎవరైతే దుర్గా నామాన్ని సదా స్మరిస్తూ ఉంటారో, వాళ్లందరికీ త్రిమూర్తులు కూడా అనుకూల ఫలితాలను అందిస్తూ వుంటారు. ఆ ఇల్లు సకలశుభాలకు నిలయంగా చేస్తారు. అందుకే దుర్గా నామాన్ని సదా స్మరిస్తూ వుండాలి ... ఆ తల్లి చల్లని నీడలో సుఖశాంతులతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తూ వుండాలి.


More Bhakti News