భగవంతుడి కృప అలాంటిది !
అనునిత్యం భగవంతుడిని పూజించడం ... అనుక్షణం ఆయనని సేవించడంలోనే కొంతమంది భక్తులు అనుభూతి చెందుతుంటారు. భగవంతుడి ఎడబాటును ఎంతమాత్రం భరించలేనంతగా ఆయనని ఆరాధిస్తుంటారు. సదా ఆయన పాదాలను సేవించుకునే భాగ్యం తప్ప తమకి మరేమీ అవసరం లేదన్నట్టుగానే వాళ్లు వ్యవహరిస్తూ వుంటారు.
ఆలయం తలుపులు మూసి .. తిరిగి తెరిచే వరకూ అక్కడి దైవాన్ని చూడకుండా ఉండలేక వాళ్లు ఎంతగానో తపించిపోయేవాళ్లు. అలాంటి భక్తుల దగ్గరికి భగవంతుడే స్వయంగా నడచివచ్చిన సందర్భాలు వున్నాయి. తనని సేవించినందుకు ప్రతిగా ఆయనే సేవలు చేసిన సంఘటనలూ వున్నాయి. పోతన .. త్యాగయ్య .. క్షేత్రయ్య .. అన్నమయ్య .. తులసీదాసు .. కబీరుదాసు .. కనకదాసు .. పురందరదాసు .. రామదాసు వంటి మహాభక్తులందరికీ భగవంతుడిపై తప్ప మరిదేనిమీద ఆశా లేదు ... ధ్యాసా లేదు. అలాంటి వాళ్లందరినీ ఆ స్వామి ప్రత్యక్షదర్శనంతో అనుగ్రహించాడు.
ఇక హథీరామ్ బావాజీ ... తరిగొండ వెంగమాంబ ఆ శ్రీనివాసుడి దర్శనభాగ్యం కోసం తపించిపోతూ వుంటే ఆ స్వామి నేరుగా వాళ్ల దగ్గరికే వచ్చేవాడు. హథీరామ్ బావాజీతో సరదాగా పాచికలు ఆడాడు ... వెంగమాంబ రచనలు వింటూ మురిసిపోయేవాడు. గోరా కుంభార్ అసమానమైన భక్తికి ముగ్ధుడైన పాండురంగడు ఆ ఇంటికి పనివాడిగా వెళ్లాడు. అదే స్వామి తన దర్శనం కోసం తపిస్తోన్న సక్కుబాయి కోసం ఆమెలానే మారిపోయి ఆ ఇంటి చాకిరీ చేశాడు.
ఇలా ఎంతోమంది భక్తులు తమ అచెంచలమైన భక్తివిశ్వాసాలతో భగవంతుడిని మెప్పించారు. గర్భాలయం దాటుకుని ఆయన కదిలివచ్చేలా చేశారు. భగవంతుడి సన్నిధిలో ఉండటానికి భక్తులు ఎంతగా తపించిపోతారో, అలాంటి భక్తుల మనసులో కొలువై ఉండటానికి భగవంతుడు అంతకన్నా ఎక్కువగా ఆరాటపడతాడని ఈ లోకానికి చాటిచెప్పారు.