దైవం ఎవరిని సదా రక్షిస్తూ వుంటుంది ?
ఆలయ దర్శనం చేసినా ... పూజామందిరం దగ్గర కూర్చుని ప్రార్ధించినా ... మనసులో భగవంతుడి నామాన్ని స్మరించినా ఆది ఆయన అనుగ్రహం కోసమే. ఆయన అందించే పుణ్య ఫలాల కోసమే. తపస్సు చేయడం వలన ... యజ్ఞయాగాదులు నిర్వహించడం వలన ... దైవానుగ్రహం లభిస్తుంది. ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన మనసు గెలుచుకున్న మహానుభావులు కూడా ఎంతోమంది వున్నారు.
ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ వెళుతుంటారో, వాళ్లని ఆ భగవంతుడు అనుసరిస్తూ వస్తుంటాడు. ధర్మబద్ధమైనవారి జీవితానికి అడ్డుపడుతోన్న అవాంతరాలను ఆయనే తొలగిస్తూ వుంటాడు. పరస్త్రీని తల్లిగా భావించాలనీ, పరుల ధనాన్ని పాముగా తలచాలని ఎంతోమంది మహానుభావులు సెలవిచ్చారు. ఇతరులు బాధపడుతూ వుంటే సంతోషించకూడదనీ, వాళ్లు సంతోషంగా వుంటే బాధపడకూడదని చెబుతూ వచ్చారు.
కష్టాల్లో వున్నవారిని ఆలస్యంచేయక ఆదుకోవడానికి ముందుకు రావాలనీ, తమ వలన ఇతరులు బాధపడకుండా నడచుకోవాలని చాటిచెప్పారు. ఇతరులకు సాయపడటానికి భగవంతుడు తమని ఒక సాధనంగా ఎంచుకున్నాడని భావించాలేగానీ, తామే సాయం చేస్తున్నామనే అహంభావం ఎలాంటి పరిస్థితుల్లోను దరిచేరనీయకూడదంటూ జ్ఞానబోధ చేశారు. ప్రకృతిఒడిలో సేదదీరే ప్రతిజీవిని చూసి భగవంతుడి లీలావిశేషంలోని గొప్పతనాన్ని తలచుకుంటూ అనుభూతి చెందాలేగాని, దేనికీ హాని తలపెట్టకూడదంటూ శాంతిమంత్రాన్ని ఉపదేశించారు.
పదిమందికి సాయపడటమే పరమసంతోషంగా ... ఆ సంతోషం అందించే సంతృప్తియే పరమార్థంగా భావిస్తూ వుండాలని స్పష్టం చేశారు. మానవసేవలోను ... మాధవుడి సేవలోను లభించే అలౌకికమైన ఆనందాన్ని ప్రచారం చేశారు. ధర్మాన్ని ఆశ్రయించినవారిని భగవంతుడు సదా రక్షిస్తూ ఉంటాడని ఈ లోకానికి చాటిచెప్పారు.